Begin typing your search above and press return to search.

రోబోతో పెట్టుకున్నోడు గెలిచేట్టున్నాడు

By:  Tupaki Desk   |   1 Oct 2015 5:06 AM GMT
రోబోతో పెట్టుకున్నోడు గెలిచేట్టున్నాడు
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందించిన రోబో 2010లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఐదేళ్ల క్రితం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ రికార్డుల్ని తిర‌గ‌రాసింది. అయితే రిలీజ్ టైమ్‌ లో రోబో కాపీ క‌థ అంటూ అప్ప‌ట్లో కొంద‌రు ర‌చ‌యిత‌లు ఈ సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై కోర్టులో కేసులు వేసిన సంగ‌తి తెలిసిందే. మ‌న తెలుగువాడైన ర‌చ‌యిత విజ‌యార్కె నా న‌వ‌ల మేన్‌ రోబోని కాపీ కొట్టేసి శంక‌ర్ సినిమా తీశాడంటూ మీడియా ముందు వాపోయాడు. అయితే అత‌డి గోడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు కానీ.. ఓ త‌మిళ ర‌చ‌యిత వేసిన కేసు మాత్రం రోబో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మెడ‌కు గ‌ట్టిగానే బిగుసుకుంది.

ఎందిర‌న్ క‌థ కాపీ క‌ట్టేశారు, అది నాదే అంటూ .. ఓ త‌మిళ ర‌చ‌యిత మొర‌ను మ‌ద్రాసు హైకోర్టు ప‌ట్టించుకుంది. ఆ కేసు ఇంత‌కాలానికి ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంతేకాదు ర‌చ‌యిత కోర్టులో వినిపించిన వాద‌న నెగ్గేట్టే క‌నిపిస్తోంది. సినిమాలో చూపించిన‌దానికి అత‌డి న‌వ‌ల‌లో ఉన్న‌దానికి సేమ్ టు సేమ్ క‌నిపించినా, అందుకు రికార్డెడ్ ఎవిడెన్స్ స‌మ‌ర్పించినా ప‌రిశీలిస్తామ‌ని కోర్టు చెప్పింది. ఆ మేర‌కు రోబో శంక‌ర్‌ కి - స‌న్ పిక్చ‌ర్స్ క‌ళానిధి మార‌న్‌ కి తాఖీదులు త‌ప్ప‌లేదు.

అస‌లింత‌కీ ఏ న‌వ‌ల నుంచి కాపీ కొట్టేశాడు ? అంటే .. అరుర్ త‌మిళ‌నంద‌న్ అనే ర‌చ‌యిత జుగిబ పేరుతో ఓ సీరియ‌ల్‌ రాశాడు. అది ఇనియ ఉద‌యం అనే త‌మిళ మ్యాగ‌జైన్‌ లో ప‌బ్లిష్ అయ్యింది. ఆ త‌ర్వాత తిక్ తిక్ తీపిక పేరుతో 2007లో న‌వ‌ల రిలీజైంది. ఆ న‌వ‌ల‌నే ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాపీ కొట్టేసి సినిమా తీశాడంటూ అత‌డు కోర్టులో పిటిష‌న్ వేశాడు. న‌ష్ట‌ప‌రిహారంగా కోటి రూపాయ‌లు చెల్లించాలంటూ దావా వేశాడు. ఇంత‌కాలానికి ఆ కేసుకు సంబంధించిన పురోగ‌తి క‌నిపిస్తోంది. పైగా ఈ కేసులో ర‌చ‌యిత అరుర్ త‌మిళ నంద‌న్ గెలిచే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయిట‌.