Begin typing your search above and press return to search.

శింబుకు మద్రాస్‌ హైకోర్టు అక్షింత‌లు!

By:  Tupaki Desk   |   1 Sep 2018 1:41 PM GMT
శింబుకు మద్రాస్‌ హైకోర్టు అక్షింత‌లు!
X
కోలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ - ద‌ర్శ‌కుడు - న‌టుడు టి.రాజేంద‌ర్‌ - ఆయ‌న కొడుకు హీరో శింబు పేరు నిత్యం వార్త‌ల్లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌టి ధ‌న్సిక‌ను స‌భాముఖంగా అవ‌మానించిన రాజేంద‌ర్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక‌, ఆయ‌న త‌న‌యుడు శింబు త‌న సినిమా ‘అన్బనవన్‌ అసరధవన్‌ అదంగధవన్‌’ (ఏఏఏ)’షూటింగ్ కు స‌రిగ్గా హాజ‌రుకాలేద‌ని, ఆఖ‌రికి డ‌బ్బింగ్ కూడా బాత్రూంలో నుంచి చెప్పి పంపాడ‌ని నిర్మాత మైకేల్ రాయప్పన్ గ‌తంలో ఆరోపించారు. శింబు వ‌ల్ల న‌ష్టపోయిన రూ.20 కోట్లు పరిహారంగా ఇప్పించి, శింబుపై నిషేధం కూడా విధించాలని డిమాండ్ చేశాడు. ఆ త‌ర్వాత అరాస‌న్ చిత్రంలో న‌టించేందుకు అడ్వాన్స్ తీసుకున్న శింబు ....ఆ సినిమాలో న‌టించ‌క‌పోగా , డ‌బ్బులు తిరిగివ్వ‌లేద‌ని మ‌రో నిర్మాత కోర్టుకెక్కారు. ఈ కేసులో తాజాగా శింబుకు మ‌ద్రాసు హైకోర్టు అక్షింత‌లు వేసింది.

`అరాసన్‌` చిత్రంలో హీరోగా నటించేందుకు 2013 జూన్‌ 17న శింబు ....రూ. 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడ‌ని ప్యాషన్‌ మూవీ మేకర్స్ ఆరోపించింది. అయితే, ఆ చిత్ర షూటింగ్ లో శింబు పాల్గొన‌లేద‌ని, త‌మ డ‌బ్బు కూడా తిరిగివ్వ‌లేద‌ని మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో, ఆ కేసు విచార‌ణ చేప‌ట్టిన మ‌ద్రాసు హైకోర్టు శింబుపై మండిప‌డింది. ప్యాష‌న్ మూవీ మేక‌ర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను..వడ్డీతో సహా చెల్లించాలని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశించింది. శింబు వడ్డీతో సహా రూ.85 లక్షలు ప్యాషన్‌ మూవీ మేకర్స్ కు చెల్లించాలని ఆదేశించింది. ఒక‌వేళ శింబు డబ్బు చెల్లించని ప‌క్షంలో ఇల్లు - ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. తాజా, తీర్పుపై శింబు స్పందించాల్సి ఉంది.