Begin typing your search above and press return to search.

బాహుబలి హిట్..ఇప్పుడు మగధీర వంతు.!

By:  Tupaki Desk   |   13 July 2018 8:45 AM GMT
బాహుబలి హిట్..ఇప్పుడు మగధీర వంతు.!
X
జక్కన్న రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశం మొత్తం మీద అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మూవీగా రికార్డులకెక్కింది. ఇండియాలోని అన్ని భాషల్లో బాహుబలిని రిలీజ్ చేశారు. అన్ని చోట్ల అభిమానులను మెప్పించింది.

ఇక బాహుబలిని ఇతర దేశాల భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదల చేసిన ప్రతి భాషలోనూ మంచి ఆదరణ దక్కింది. తాజాగా ఇటీవలే జపనీస్ భాషలోకి డబ్ చేశారు. అక్కడ కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో కుమారవర్మ క్యారెక్టర్ చేసిన సుబ్బరాజు అభిమానుల కోరిక మేరకు జపాన్ వెళ్లి వారిని కలిసి వచ్చాడు. బాహుబలికి జపాన్ లో వచ్చిన ఆదరణను చూసి ఇప్పుడు మగధీర మూవీ మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డారనే వార్త హల్ చల్ చేస్తోంది.

మగధీర మూవీ 2009లో రిలీజ్ అయ్యింది. దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. బాహుబలికి - దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు మగధీరని జపాన్ లో చూపించడానికి నిర్మాతలు ఆసక్తితో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయమై అధికారికంగా మగధీర నిర్మాతలు స్పందించలేదు.

ఇక మగధీర లో రాజులు - యుద్ధాలు ఎపిసోడ్ కొద్దిసేపే ఉంటుంది. మిగతాదంతా ఇప్పటికాలంలో నడుస్తుంది. మరి బాహుబలి లాంటి పూర్తి రాజుల కాలం నాటి సినిమాను ఆదరించిన జపాన్ ప్రేక్షకులకు మగధీర నచ్చుతుందో లేదో చూడాలి మరి..