Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డ్‌: మ‌హానటి వ‌ర్సెస్ రంగ‌స్థ‌లం

By:  Tupaki Desk   |   26 April 2019 12:09 PM GMT
జాతీయ అవార్డ్‌: మ‌హానటి వ‌ర్సెస్ రంగ‌స్థ‌లం
X
త్వ‌ర‌లో 66వ జాతీయ పుర‌స్కారాల్ని(2018-19) కేంద్రం ప్ర‌క‌టించ‌బోతున్న విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా లోక్‌ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో జాతీయ పుర‌స్కారాల‌ ప్ర‌క‌ట‌న‌ని వాయిదా వేశారు. అయితే మే 19 తో అన్ని ద‌శ‌ల‌ ఎన్నిక‌లు పూర్తి అయిన త‌ర్వాత‌ ఏ క్ష‌ణంలోనైనా 66వ జాతీయ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. అయితే ఈసారి టాలీవుడ్ స‌న్నివేశ‌మేంటి? జాతీయ స్థాయిలో `బాహుబ‌లి-2` త‌రువాత టాలీవుడ్ నుంచి ఏ సినిమా అవార్డు గెలుచుకోనుంది? అన్న‌ ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. గ‌త ఏడాది టాలీవుడ్ లో విడుద‌లైన కొన్ని చిత్రాలు మంచి విజ‌యాల్నిసాధించ‌డంతో పాటు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌హాన‌టి- రంగ‌స్థ‌లం- గీత‌ గోవిందం- కేరాఫ్ కంచ‌ర‌పాలెం- భ‌ర‌త్ అనే నేను చిత్రాలు ఈసారి జాతీయ అవార్డుల కోసం పోటీప‌డుతున్నాయి.

ఈ ఐదు చిత్రాల్లో పోటీ మాత్రం కీర్తిసురేష్, రామ్‌ చ‌ర‌ణ్ సినిమాల మ‌ధ్య‌నే ప్ర‌ధానంగా వుండే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌. కీర్తిసురేష్ న‌టించిన‌ `మ‌హాన‌టి`, రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` చిత్రాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. మ‌హాన‌టిగా సావిత్రి పాత్ర‌కు ప్రాణ‌ప్ర‌తిష్ట చేసి విమ‌ర్శ‌కుల‌తో పాటు ప్రేక్ష‌కుల్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది కీర్తి సురేష్. చెవులు వినిపించ‌ని చిట్టి బాబుగా రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా అభిన‌యించారు. `రంగ‌స్థలం`లో రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో న‌టించిన స‌మంత‌కు అంతే ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్రాంతీయ కేట‌గిరీలో ఏది ఉత్త‌మ సినిమాగా ఎంపిక‌వుతుంది? న‌టీన‌టుల్లో జాతీయ అవార్డు ఎవ‌రికి ద‌క్కుతుంది? ఈ ద‌ఫా జాతీయ పుర‌స్కారం ఎవ‌రిని వ‌రిస్తుంది? అంటూ స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేష్ ఓ మెట్టు పైనే ఇత‌రుల‌కు పోటీనిస్తుండ‌డం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక భ‌రత్ అనే నేను చిత్రంలో మ‌హేష్ న‌ట‌న‌.. గీత గోవిందం చిత్రంలో దేవ‌ర‌కొండ - ర‌ష్మిక‌ల న‌ట‌న తీసిక‌ట్టుగా ఏం లేదు. కేరాఫ్ కంచ‌ర పాలెం పాత్ర‌ల్ని .. పాత్ర‌ధారుల్ని.. స్క్రీన్ ప్లేని హైలైట్ గా ఆవిష్క‌రించింది. ఇక ఉత్త‌మ న‌టుడు.. ఉత్త‌మ న‌టి కేట‌గిరీలో ఒకే భాషా చిత్రానికి రెండూ ఇచ్చిన సంద‌ర్భాలు అరుదు. ఒక్కో ప్రాంతీయ భాష‌కు ఒక్కోటి పంచేసే వైనం చూస్తున్న‌దే. కాబ‌ట్టి ఏ సినిమా జాక్ పాట్ కొడుతుంది? అన్న‌ది చూడాలి.

అయినా పోటీ మాత్రం సుస్ప‌ష్టం. మ‌హాన‌టి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత అశ్వ‌నీద‌త్ కేంద్రానికి ప్ర‌త్య‌ర్తి పార్టీ అయిన‌ టీడీపీకి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఈ చిత్రానికి లాబీయింగ్ చేసే అవ‌కాశం లేకుండా పోయింద‌ని, దీంతో `మ‌హాన‌టి`కి జాతీయ పుర‌స్కారం ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌నే విశ్లేష‌ణ మ‌రోవైపు సాగుతోంది. మ‌రి రాజకీయాల‌కు అతీతంగా ఈ ఎంపిక‌లు సాగుతాయా? లేదా..? అన్న‌ది చూడాలి.