Begin typing your search above and press return to search.

టిక్కెట్టు పెంపుపై రాజుగారి వివ‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   8 May 2019 7:38 AM GMT
టిక్కెట్టు పెంపుపై రాజుగారి వివ‌ర‌ణ‌!
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా `మ‌హ‌ర్షి` మానియా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టిక్కెట్టు కోస‌మ‌ని ఆన్ లైన్ బుకింగ్ కి వెళితే అక్క‌డ సోల్డ్ ఔట్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోతున్నారు. తొలి వీకెండ్ ఈ సినిమాని వీక్షించే ఛాన్సే లేద‌ని సీన్ చెబుతోంది. అయితే ఈ ఊపులోనే మ‌హ‌ర్షికి సంబంధించిన ర‌క‌ర‌కాల వివాదాల గురించి మీడియాలో క‌థ‌నాలు హైలైట్ అయ్యాయి. ఈ సినిమా టిక్కెట్టు రేట్ల పెంపు విష‌యం స‌హా ఎన్ని స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు? ఐదో షో ప‌ర్మిష‌న్ ప్ర‌భుత్వం నుంచి అధికారికంగా ఉందా లేదా? అస‌లు టిక్కెట్టు రేట్ల పెంపున‌కు అధికారులు అనుమ‌తులిచ్చారా లేదా? ప‌్ర‌భుత్వాల ఇన్వాల్వ్ మెంట్ ఎంత‌? వ‌గైరా విష‌యాల‌పై నేరుగా నిర్మాత దిల్ రాజు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

నేడు హైద‌రాబాద్ లోని కార్యాల‌యంలో దిల్ రాజు ముచ్చ‌టిస్తూ-``ఈ శుక్ర‌వారం మ‌హ‌ర్షి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తొలి నుంచి మేం ఈ సినిమా విజ‌యంపై ధీమాగా ఉన్నాం. మ‌హ‌ర్షి ష్యూర్ షాట్ హిట్. భారీ స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నాం. ఇది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కాదు.. ఎన్నో సినిమాల నిర్మాత‌గా అనుభ‌వంతో చెబుతున్నా`` అని తెలిపారు. ఈ సినిమా మొత్తం ఎన్ని స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది? అన్న ప్ర‌శ్న‌కు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2000 పైగా స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇంకా స్క్రీన్ల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక స్క్రీన్ల‌లో రిలీజ‌వుతున్న ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. టిక్కెట్టు ధ‌ర‌ల పెంపున‌కు స్థానిక థియేట‌ర్ యాజ‌మాన్యాలు అధికారుల నుంచి అనుమ‌తులు తెచ్చుకున్నాయి. అందుకు సంబంధించిన కోర్టు ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి అని దిల్ రాజు తెలిపారు. అలాగే తెలంగాణ లో ఐదో ఆట ఆడించేందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించింద‌ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్ లో పెరిగిన టిక్కెట్టు ధ‌ర‌ల గురించి చెబుతూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ. 110కి పెంచారు.. మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచి రూ.150 చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200 పెంచార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ జీవో వ‌చ్చినా చిన్న‌పాటి క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల ఇంత ప్ర‌చార‌మైంద‌ని తెలిపారు.

తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌లు అధికంగా పెంచార‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. రాజమండ్రి.. ఏలూరు.. విజయవాడ.. గుంటూరు.. లాంటి న‌గ‌రాల్లో సింగిల్ స్క్రీన్ లోనే రూ. 200 రేటు ప‌లుకుతోంద‌ని.. తెలంగాణ‌లో అలాంటి సంస్కృతి లేనేలేద‌ని దిల్ రాజు అన్నారు. బెంగ‌ళూరు లాంటి మెట్రోల్లో వీకెండ్స్ లో రూ.300.. రూ.500 గుంజుతున్నార‌ని వెల్ల‌డించారు. అయితే తెలంగాణ‌లో అలా లేదు. కానీ బ‌డ్జెట్ ఎక్కువైన‌ప్పుడు సినిమాకి ఆదాయం రాబ‌ట్టేందుకు ఇలా టిక్కెట్టు ద‌ర పెంచాల్సి వ‌స్తోంద‌ని.. కేవ‌లం నాలుగు రోజులు ఆడుతున్న ఈ రోజుల్లో టిక్కెట్టు రేటు పెంచ‌డం త‌ప్పేమీ కాద‌ని దిల్ రాజు స‌మ‌ర్థించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. బ‌డ్జెట్లు ఎక్కువైన‌ప్పుడు మాత్ర‌మే చ‌ట్ట‌బ‌ద్ధంగా రేట్లు పెంచుతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇక టిక్కెట్టు రేట్ల పెంప‌కంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏమాత్రం సంబంధం లేద‌ని.. కేవ‌లం ఐదో ఆట అనుమ‌తి వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి సంబంధం ఉందిని వెల్ల‌డించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హ‌ర్షి చిత్రానికి సంబంధించిన ఊహాగానాలు.. సందేహాలు.. అనుమానాల‌కు చెక్ ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే టిక్కెట్టు పెంపుపై కోర్ట్ ఆర్డర్స్ కి సంబంధించిన ప్రింట్లు ఈ మీడియా ప్ర‌తినిధులకు చేరాయి.