Begin typing your search above and press return to search.

500 థియేట‌ర్ల‌లో మ‌హాత్మ గాంధీ సినిమాలు ఫ్రీ

By:  Tupaki Desk   |   9 Aug 2022 9:30 AM GMT
500 థియేట‌ర్ల‌లో మ‌హాత్మ గాంధీ సినిమాలు ఫ్రీ
X
75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు దాదాపు 500 పైగా థియేటర్స్ లో మార్నింగ్ షో గా విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడం కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను ప్రదర్శించారు. ఈ షో కార్యక్రమం 15 రోజులు కొనసాగుతుందని తెలిసింది.

ఐమాక్స్ థియేటర్ లో షో ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసాద్ ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొత్త బసిరెడ్డి - కార్యదర్శి కె.యల్.దామోదర ప్రసాద్- తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ .. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో తెలంగాణ ఎగ్జిబ్యూటర్ ల సహకారంతో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

కార్య‌క్ర‌మంలో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి వ‌ర్యులు త‌ల‌సాని మాట్లాడుతూ.. మ‌హాత్ముని జీవిత చ‌రిత్ర గురించి నేటిత‌రం విద్యార్థులు తెలుసుకుని స్ఫూర్తి పొందాలి. ఇలాంటి మ‌రిన్ని సినిమాల‌ను ఉచితంగా ప్ర‌ద‌ర్శించాల‌ని అన్నారు. ఇటీవ‌లి కాలంలో దేశ‌భ‌క్తి సినిమాలు వెల్లువ‌లా రాక‌పోయినా అడ‌పాద‌డ‌పా మేజ‌ర్ (అడివి శేష్‌) లాంటి చిత్రాలు అల‌రిస్తున్నాయి. దేశం కోసం త్యాగం చేసే జ‌వాన్ల జీవితాల‌పై మ‌రిన్ని సినిమాలు రావాల‌ని ఆకాంక్షించారు. యూరి- మేజ‌ర్ లాంటి సినిమాలు యువత‌రంలో స్ఫూర్తి నింపుతాయ‌ని అన్నారు.

జాతిపిత‌పై మ‌రో ప్ర‌యోగాత్మ‌క సిరీస్:

జాతిపిత గాంధీజీపై ఎన్నో సినిమాలొచ్చాయి. 'అహింస' నినాదంతో భార‌త‌దేశ‌ స్వాతంత్య్ర స‌మ‌రంలో పోరాడిన అసాధార‌ణ నాయ‌కుడిగా మ‌హాత్మాగాంధీకి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గాంధీజీకి గౌర‌వం గుర్తింపు ఫాలోయింగ్ ఉన్నాయి. గాంధీజీ జీవిత చ‌రిత్ర‌పై ప‌లు చిత్రాలు విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. గాంధీ- గాంధీ మై ఫాద‌ర్- ది మేకింగ్ ఆఫ్ ది మ‌హాత్మ‌- ది గాంధీ మ‌ర్డ‌ర్- హ‌మ్ నే గాంధీకో మార్ దియా- నాను గాంధీ- హే రామ్ .. ఇలా ఎన్నో సినిమాల్లో గాంధీజీ పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు సృజించారు. అవ‌న్నీ ఆస‌క్తిని క‌లిగించాయి. ప‌లు రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న హిందీ చిత్రాల్లో గాంధీజీ పాత్ర‌లు మెప్పించాయి.

ఇటీవ‌ల 'ది బిగ్ బుల్' ఫేం ప్ర‌తీక్ మహాత్మా గాంధీ పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రచించిన 'గాంధీ'పై అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్న ఓ రెండు పుస్తకాల హక్కులను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ పుస్త‌కాల ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. గాంధీజీ ప్రారంభ రోజుల నుండి దక్షిణాఫ్రికాలో అతని చర్యల వరకు... అలాగే భారతదేశంలోని స్వాతంత్య్ర స‌మ‌రం వరకు యువ గాంధీని మహాత్ముడిగా రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అతని జీవితంలో అంతగా తెలియని కథలను ఈ సిరీస్ తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ బాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషించనున్నారు.

నిజానికి మ‌హాత్మ గాంధీజీపై నేటిత‌రానికి తెలిసింది చాలా త‌క్కువ‌. పుస్త‌కాలు చ‌దివే అలవాటు అంత‌రించిన ఈ యుగంలో.. విజువ‌ల్ మీడియంపై ఆధార‌ప‌డుతున్న నేటి జ‌న‌రేష‌న్ కి ఇలాంటి సిరీస్ లు సినిమాలు చాలా ఇన్ఫ‌ర్మాటిక్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.