Begin typing your search above and press return to search.

మహాత్ముడికి నీరాజనాలు పట్టిన మన సినిమాలు!

By:  Tupaki Desk   |   2 Oct 2021 7:35 AM GMT
మహాత్ముడికి నీరాజనాలు పట్టిన మన సినిమాలు!
X
భారతదేశ చరిత్రలో మహాత్మ గాంధీ స్థానం ప్రత్యేకం .. ఆయన ప్రయాణం అనితర సాధ్యం. ఆయన గురించి చెప్పుకోవడమంటే సముద్రాన్ని దోసిట్లో పట్టే ప్రయత్నం చేయడం వంటిది .. ఆకాశంలోని నక్షత్రాలను ఏరాడనికి పూనుకోవడం వంటిది. ఆశ కంటే ఆశయం బలమైనదని ఆచరణలో చూపినవారాయన. తూటా కంటే మాట బలమైనదనే విషయాన్ని స్పష్టం చేసినవారాయన. నలుగురిని వెనకేసుకు తిరిగేవాడు కాదు .. నలుగురి ముందు నడిచేవాడే నాయకుడు అని నిరూపించినవారాయన. తెల్లవారు తమ బూట్ల చప్పుళ్లతో భారతీయులను భయపెట్టాలని చూస్తే, వాళ్ల తుపాకులకు ఎదురెళ్లిన ధీశాలి ఆయన.

మహాత్మ గాంధీ జీవితమే ఒక చరిత్ర .. ఆయన వేసిన ప్రతి అడుగు ఒక పాఠమే .. భవిష్యత్తు తరాలవారికి వేసిన బాటనే. సంకల్పానికి మించిన సాధనం .. ఆశయానికి మించిన ఆయుధం లేదనేది ఆయన ఆలోచన. హింసకు ప్రతి హింస పరిష్కారం కాదు, సహనంతో సాధించలేనిది లేదు అని నినదించినవారాయన. ఆయన సిద్ధాంతం .. వ్యక్తిత్వం .. మరణానికి సైతం భయపడని మనోబలం చూసే, అశేష భారతీయులు ఆయనను అనుసరించారు. మహాత్మ గాంధీ అంటే వేగం .. కార్యదీక్షతో ఆయన వడివడిగా అడుగులు వేస్తుంటే, ఆయనను అందుకోవడానికి జనాలు పరుగులు పెట్టేవారు.

గమ్యానికి చేరుకోవడానికి ఆయన పడిన తపన అది .. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన పడిన ఆరాటం అది. అందుకు నిదర్శనంగా ఆనాటి డాంక్యుమెంటరీలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. ఆ సజీవ సాక్ష్యాలు మనలోని దేశభక్తికి ఊపిరిలూదుతూనే ఉన్నాయి. గుండె పీఠంపై ఎగరేసిన జెండాను రెపరెపలాడిస్తూనే ఉన్నాయి. స్వేచ్ఛ కోసం .. స్వాత్యంత్రం కోసం అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడిన వీరుడాయన. వాటి కోసం ఆకలి దప్పులను పక్కన పెట్టి అహర్నిశలు తపస్సు చేసిన మహర్షి ఆయన. అందువల్లనే ఆయన కోట్లాదిమంది భారతీయుల గుండె గుడిలో పూజలు అందుకుంటున్నారు. ఆయన జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారు.

అలాంటి మహాత్ముడిని సినిమాల ద్వారా కూడా మనం తలచుకుంటూనే ఉన్నాము. అంకితభావంతో ఆయనకి పాటల నీరాజనాలు పడుతూనే ఉన్నాము. 1938లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన 'మాలపిల్ల' సినిమాలో, 'కొల్లాయి గట్టితేనేమి ..' అంటూ గాంధీజీపై ఒక పాట వస్తుంది. బసవరాజు అప్పారావు రాసిన ఆ పాటకు అప్పట్లో విశేషమైన ఆదరణ లభించింది. 'భలే తాత మన బాపూజీ' (దొంగరాముడు) 'భారతమాతకు జేజేలు' (బడిపంతులు) 'గాంధి పుట్టిన దేశమా ఇది' (పవిత్ర బంధం) 'గాంధీ పుట్టిన దేశం .. రఘురాముడు ఏలిన రాజ్యం( గాంధీ పుట్టిన దేశం) 'నీ ధర్మం .. నీ సంఘం ( కోడలుదిద్దిన కాపురం) సినిమాల్లోని పాటలు .. గాంధీజీని అర్చించిన సుమధుర సుమాలు.

బ్రిటిష్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన 'గాంధీ' చిత్రం, భారతీయ భాషలన్నింటిలోకి అనువాదమై, ఆయన అనుసరించిన మార్గాన్ని మరిచిపోకుండా చేసింది. 'మేకింగ్ ఆఫ్ మహాత్మ' .. 'సర్దార్' .. 'హే రామ్' .. 'గాంధీ - మై ఫాదర్' .. 'లగేరహో మున్నాభాయ్' .. 'మైనే గాంధీ కో నహీ మారా' .. ఇలా మహాత్ముడి మహోన్నతమైన చరిత్రను భారతీయ సినిమాలన్నీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాయి. ఆ మూర్తిని .. స్ఫూర్తిని తెరపై ఆదర్శవంతంగా ఆవిష్కరిస్తూనే ఉన్నాయి.

ఈ రోజున బోసి నవ్వుల బాపు జయంతి .. ఈ సందర్భంగా ఆ శాంతిదూతను మనసారా స్మరించుకుందాం! ఆయన అడుగుజాడలలో నడుస్తూ, బాపు రూపాన్ని గుండె గదులలో పదిలంగా భద్రపరచుకుందాం!!