Begin typing your search above and press return to search.

ఇది మీరిచ్చిన సక్సెస్ నాన్నా: మహేశ్ బాబు

By:  Tupaki Desk   |   19 Jun 2022 8:31 AM GMT
ఇది మీరిచ్చిన సక్సెస్ నాన్నా: మహేశ్ బాబు
X
కృష్ణ అంటే మహేశ్ బాబుకి ఎంత ప్రేమనో .. ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయా సందర్భాల్లో తండ్రి గురించిన ప్రస్తావనను మహేశ్ బాబు తీసుకుని వస్తూనే ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ కోసం ఆయన ఎలా సమయాన్ని కేటాయించేవారనేది చెబుతూనే ఉంటాడు. తన చిన్నప్పుడు తనని షూటింగులకు తీసుకుని వెళ్లింది .. ఒక హీరో కొడుకుగా అక్కడ తన జరిగిన మర్యాదలను గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. ఇక తన సినిమాల విషయంలో తన తండ్రి అభిప్రాయం నిజమవుతూ ఉంటుందని గర్వంగా చెబుతుంటాడు.

ఇక కృష్ణ కూడా మహేశ్ బాబు కెరియర్ పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు. తన ఆరోగ్యం విషయంలో మహేశ్ బాబు శ్రద్ధ తీసుకుంటూ, సరైన కథలను ఎంచుకుంటూ వెళుతుండటం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలా తండ్రీకొడుకుల అనుబంధానికి ఇద్దరూ కూడా నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటారు .. అసలైన నిర్వచనంలా అనిపిస్తూ ఉంటారు. ఈ రోజున 'ఫాదర్స్ డే' కావడంతో తన తండ్రిపై తనకి గల ప్రేమానురాగాలను మహేశ్ బాబు మరోసారి చాటుకున్నాడు.

"ఒక తండ్రి ఎలా ఉండాలనేదానికి మీరు ఉదాహరణగా నిలిచారు. ఈ రోజున నేను ఈ స్థాయికి రావడమనేది మీరు లేకుండా ఎలా సాధ్యమవుతుంది?" అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఉన్న మహేశ్ బాబు, ఫాదర్స్ డే రోజున తన తండ్రి పట్ల తనకిగల ప్రేమాభిమానాలను వ్యక్తం చేశాడు. ఆయన కారణంగానే తాను ఈ రోజున ఈ స్థాయికి వచ్చానంటూ ఒక తండ్రి గర్వపడేలా రాసుకొచ్చాడు. తండ్రిని ఎంతగా ప్రేమించాలనే విషయాన్ని తన కుమారుడైన గౌతమ్ కి అర్థమయ్యేలా .. తానే స్ఫూర్తిగా నిలిచేలా చేశాడు.

ఇక ఇటీవలే 'సర్కారువారి పాట' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చిన మహేశ్ బాబు, ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ తో మహేశ్ చేస్తున్న మూడో సినిమా ఇది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది.