Begin typing your search above and press return to search.

ఘట్టమనేని 'మైత్రి' బంధం

By:  Tupaki Desk   |   2 July 2018 9:38 AM GMT
ఘట్టమనేని మైత్రి బంధం
X
పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే మూడు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రస్తుతం యమా జోష్ లో ఉంది. నిర్మాణంలో ఉన్న సినిమాలతో పాటు కొత్త వాటిని వేగంగా లైన్ లో పెడుతుండటంతో అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకేసారి మహా అయితే రెండు సినిమాలు నిర్మించడమే తలకు మించిన భారంగా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా మూడు నాలుగు సినిమాలు బడ్జెట్ పరిమితులు పెట్టుకోకుండా సెట్స్ పైన పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. హిట్ అవుతుందనుకున్న రంగస్థలం ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేయటమే కాక కొన్ని చోట్ల బాహుబలిని కూడా దాటడంతో మైత్రికి నిధుల వరద పారింది.

దాంతోనే ఇన్ని ప్రాజెక్ట్ లకు పచ్చ జెండా ఊపారని టాక్. రవితేజతో శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ నిర్మాణంలో ఉండగానే సంతోష్ శ్రీనివాస్ తో పవన్ తో మిస్ అయిన స్క్రిప్ట్ ని రవితేజతోనే నిర్మించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా నాగ చైతన్యతో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన సవ్యసాచి గ్రాఫిక్ వర్క్ కారణంగా ఆగస్ట్ లో వస్తుంది. రంగస్థలం ఇచ్చిన లాభాలే కాకుండా ముంబైకి చెందిన ఒక ప్రముఖ యాడ్ ఏజెన్సీ బ్యాక్ అప్ ఉండటం వల్లే మైత్రి ఇన్ని సినిమాలు ఏకకాలంలో నిర్మిస్తోందని ఇన్ సైడ్ టాక్. అంతే కాదు సదరు ముంబై కంపెనీకి సపోర్ట్ ఇస్తోంది మహేష్ సతీమణి నమ్రతనేనట. మైత్రి మొదటి సినిమా శ్రీమంతుడుని మహేష్ బాబు కలిసి పార్టనర్ షిప్ లో నిర్మించింది ఈ సంస్థే.

అప్పటి నుంచే మంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్న మహేష్ ఫామిలీ ప్రోత్సాహంతోనే మైత్రి ఇంత దూకుడుగా ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇవన్ని ఒక ఎత్తు అయితే మహేష్ బాబు 26వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్నది కూడా మైత్రినే. దాని కోసం భారీ బడ్జెట్ కూడా సిద్ధం చేశారట. దసరాకు లాంచ్ చేసి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపే ప్లానింగ్ లో ఉంది మైత్రి మేకర్స్. టాలీవుడ్ లో ఇలా నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టేసుకున్న సంస్థ ప్రస్తుతానికి మైత్రి ఒక్కటే. దిల్ రాజు కూడా ఇంత స్పీడ్ చూపించేవారు కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో రేస్ లో ఉన్నాడు. సో మైత్రి వెనుక వినిపిస్తున్న ఘట్టమనేని మైత్రిలో ఎంత వరకు నిజముందో కానీ ప్రస్తుతానికి దీని గురించిన చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.