Begin typing your search above and press return to search.

మహేష్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

By:  Tupaki Desk   |   20 July 2015 5:17 PM IST
మహేష్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
X
ఇంకో ఇరవై రోజుల్లో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలాగే కనిపిస్తున్న ఈ నయా సూపర్ స్టార్.. హీరో అవతారమెత్తాక కాలేజ్ స్టూడెంటుగా కనిపించింది రెండే రెండు సినిమాల్లో. ఒకటి యువరాజు, ఇంకోటి అర్జున్. ఆ రెండు సినిమాల్లో కూడా స్టోరీ పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో సాగదు. ఊరికే కాలేజ్ స్టూడెంటుగా కనిపించాడంటే కనిపించాడంతే. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మహేష్ ఇప్పుడు మళ్లీ ‘శ్రీమంతుడు’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ అవతారం ఎత్తబోతున్నాడని ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

అంతే కాదు హీరోయిన్ వెంటపడటం.. తనతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటి వ్యవహారాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం హీరో వెంట హీరోయిన్ పడటమే తప్ప హీరోయిన్ల వెంట హీరోలు పడటం అరుదు. అందులోనూ మహేష్ లాంటి అందగాడు హీరోయిన్ వెంట పడటం కూడా అంత బావుండదనో ఏమో.. ప్రిన్స్ ను అలాంటి క్యారెక్టర్లలో చూపించడానికి ఇష్టపడరు దర్శకులు. ఐతే కొరటాల శివ మాత్రం కొంచెం డిఫరెంటుగా ఆలోచించినట్లున్నాడు. మహేష్ సినిమాల్లో లవ్ స్టోరీ పండి కూడా చాలా కాలమవుతోంది. ‘శ్రీమంతుడు’లో ఆ లోటు కూడా తీర్చేయబోతున్నట్లే కనిపిస్తోంది. హీరోయిన్ రోల్ కూడా బాగానే ఉంటుందని.. మంచి లవ్ స్టోరీని చూడబోతున్నామని ‘శ్రీమంతుడు’ యూనిట్ వర్గాలు అంటున్నాయి. ట్రైలర్ తోనే మహేష్, శ్రుతి జంట కెమిస్ట్రీ అదుర్స్ అని తేలిపోయింది. ఇక సినిమాలో ఈ జంట కనువిందు చేయడం ఖాయమే అనుకోవాలి.