Begin typing your search above and press return to search.

ఇది 100 రోజుల పండుగలా ఉంది: మహేశ్ బాబు

By:  Tupaki Desk   |   16 May 2022 5:33 PM GMT
ఇది 100 రోజుల పండుగలా ఉంది: మహేశ్ బాబు
X
మహేశ్ బాబు కెరియర్లో ఆయన 27వ సినిమాగా 'సర్కారువారి పాట' సినిమా తెరకెక్కింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను కర్నూల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై మహేశ్ బాబు మాట్లాడుతూ .. "చాలా కాలం క్రితం 'ఒక్కడు' సినిమా షూటింగు కోసం కర్నూల్ కి వచ్చాను. మళ్లీ ఇంతకాలానికి ఇక్కడ ఫంక్షన్ చేయడానికి కుదిరింది.

ఇక్కడ ఫంక్షన్ చేద్దామని మా టీమ్ చెప్పినప్పుడు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అలాగే చేద్దామని అన్నాను. ఇంతమంది వస్తారని నిజంగా నేను అనుకోలేదు. అందుకే ఫస్టు టైమ్ స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేశాను .. మీ కోసమే. మీ అభిమానం .. ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా చూస్తుంటే ఇది సక్సెస్ మీట్ లా లేదు .. 100 రోజుల ఫంక్షన్ లా ఉంది. ఫంక్షన్ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నట్టుగా ఉంది. ఈ సినిమాను చూడగానే మా అబ్బాయి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో బాగా చేశావనీ .. చాలా అందంగా ఉన్నావని మా అమ్మాయి అంది.

ఆ క్రెడిట్ అంతా కూడా పరాశురామ్ గారికి దక్కుతుంది. నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టమని. మీరు చూపించిన అభిమానం .. సక్సెస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నప్పటికీ లవ్ ట్రాక్ అంటే నాకు బాగా ఇష్టం. నా క్యారెక్టర్ ను నేను కొత్తగా ఫీలై చేశాను .. దానికి మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దానికి మించిన ఆనందం మరొకటి లేదు. ఈ సినిమా కోసం ఈ రెండేళ్లుగా చాలా కష్టపడ్డాం.

కోవిడ్ వలన షూటింగు తరచూ ఆగిపోతుండటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోజున మీరిచ్చిన ఈ సక్సెస్ ఆ కష్టాలన్నీ మరిచిపోయేలా చేసింది. ఈ సక్సెస్ మా టీమ్ అందరికీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. మా నాన్నగారు ఈ సినిమా చూడగానే 'పోకిరి' .. 'దూకుడు' కంటే పెద్ద హిట్ అవుతుందని అన్నారు. ఆయన అలా అనగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఫంక్షన్ కి కీర్తి సురేశ్ రాలేకపోయింది. తను .. సముద్రఖని గారు చాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమా సక్సెస్ లో తమన్ ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇకపై కూడా మీకు నచ్చే సినిమాలే చేస్తూ ఉంటాను .. థ్యాంక్యూ" అంటూ ముగించారు.