Begin typing your search above and press return to search.

చ‌చ్చిపోయేంత అభిమానం అంటే హ‌గ్ ఇవ్వ‌ట‌మా?

By:  Tupaki Desk   |   2 May 2019 8:09 AM GMT
చ‌చ్చిపోయేంత అభిమానం అంటే హ‌గ్ ఇవ్వ‌ట‌మా?
X
సినీ ప్ర‌ముఖులంటే సామాన్యుల‌కు ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వారి కోసం దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వారు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వెండితెర వేల్పుల్ని అభిమానించ‌టం.. ఆరాధించ‌టం త‌ప్పు కాకున్నా.. వెర్రి త‌ల‌లు వేసేలా ఉండ‌టం మంచిది కాదు. ఇలాంటి వాటిని ఎక్క‌డో అక్క‌డ అడ్డుకోవ‌టం.. అలాంటి వారిని నిరుత్సాహప‌రిచేలా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

అందుకు చాలా ద‌మ్ము.. ధైర్యం అవ‌స‌రం. త‌మ మీద ప్ర‌ద‌ర్శించే అభిమానాన్ని ఓకే అన‌ట‌మే త‌ప్పించి.. వారి త‌ప్పును స‌రిచేసే ప్ర‌య‌త్నం ఏ ఒక్క హీరో చేసిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. తాజాగా మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ వేడుక సంద‌ర్భంగా ఇలాంటి సీన్ మ‌రొక‌టి క‌నిపించింది.

వేదిక మీద మ‌హేశ్ మాట్లాడుతున్న‌ప్పుడు ఒక అభిమాని దూసుకొచ్చాడు. మ‌హేశ్ వ‌ద్ద‌కు వ‌చ్చి.. సార్.. మీరంటే చ‌చ్చిపోయేంత అభిమాన‌మ‌న్నాడు.. అత‌డ్ని ద‌గ్గ‌ర‌కు తీసుకున్న మ‌హేశ్.. హ‌గ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ చ‌ర్య‌ను త‌ప్పు ప‌ట్ట‌టం లేదు. కానీ.. చ‌చ్చిపోయేంత అభిమానం ఉండాల్సింది క‌న్న‌త‌ల్లిదండ్రుల మీద.. క‌ట్టుకున్న పెళ్లాం మీద‌న అని చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి.. అంత సూటిగా కాకున్నా.. ఆ అర్థం వ‌చ్చేలా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌హేశ్ మాత్ర‌మే కాదు.. ఇలాంటి అనుభ‌వాలు ఎదుర్కొన్న చాలామంది హీరోలు వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌ట‌మే కానీ.. స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేయటం క‌నిపించ‌దు. మ‌హేశ్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. ఇలాంటి ధోర‌ణిని ప్రోత్స‌హించ‌టం కార‌ణంగా.. అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌టానికి ఇలాంటి తీరే కావాల‌న్న ధోర‌ణి అభిమానుల్లో పెర‌గ‌టం మంచిది కాదన్న విష‌యాన్ని వెండితెర వేల్పులు గుర్తించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.