Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో తెలుగు ఫాన్స్ లొల్లి

By:  Tupaki Desk   |   4 Feb 2018 11:15 AM GMT
హాలీవుడ్ లో తెలుగు ఫాన్స్ లొల్లి
X
సోషల్ మీడియా వచ్చాక అభిమానం వెర్రి తలలు వేస్తోంది అంటే ఏమో అనుకున్నాం కాని అది ఋజువు చేసేందుకు కాబోలు కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనులు చిరాకు కంటే ఎక్కువ హాస్యాన్ని కలిగిస్తున్నాయి. తమ హీరోకు పోటీ అనిపించే ఎవరినైనా సరే ట్రాల్ చేయటం అనేది మనం సహజంగా చూసేదే. కాని మనవాళ్ళు ఒక మెట్టు పైకెక్కి ఏకంగా హాలీవుడ్ నటుల ఫేస్ బుక్ పేజీల్లోకి వెళ్లి నానా రచ్చ చేస్తున్నారు. విషయానికి వస్తే ప్రముఖ హాలీవుడ్ హీరో టాం క్రూజ్ తన ఫేస్ బుక్ పేజీలో రాబోయే సినిమాలో నుంచి ఒక స్టిల్ షేర్ చేసాడు. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. కాని మహేష్ బాబు అభిమాని ఒకరు ఏకంగా టాం కన్నా తమ ప్రిన్స్ అందగాడని - ఏ రకంగా చూసుకున్నా అన్ని విషయాల్లో తనే బెస్ట్ అని ఒక మెసేజ్ పెట్టాడు. ఇలాంటి వాటికి హీరోలు సాధారణంగా స్పందించరు. సదరు అభిమాని అక్కడితో ఆగకుండా సైలెంట్ గా ఉన్నావంటే ఒప్పుకున్నట్టేగా అని అర్థం వచ్చేలా టాంకు మరో మెసేజ్ పెట్టాడు .

ఇది ఎలాగో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కంటబడింది. మహేష్ డాన్స్ గురించి ప్రస్తావిస్తూ కామెంట్స్ చేయటంతో కౌంటర్ ఎటాక్ గా మహేష్ ఫాన్స్ తమ హీరో ఇప్పటి దాకా గెలుచుకున్న నంది అవార్డులు, ఫిలిం ఫేర్, టిఎస్ఆర్, సంజయ్ దత్ పేరిట ఇచ్చిన పురస్కారాల గురించి లిస్టు పెట్టేసి ఇది మా హీరో అంటూ బదులిచ్చారు. దీంతో ఇది కాస్త ముదిరి రికార్డులు, కలెక్షన్లు, ఓపెనింగ్స్, డిజాస్టర్లు ఇలా ఒకటేమిటి అన్నింటి గురించి వాదించుకోవడం మొదలు పెట్టారు. టాం క్రూజ్ చూసాడో లేదో కాని ఇది మాత్రం టూ మచ్ అంటున్నారు నెటిజెన్లు. ఇలాంటి కొత్త ట్రెండ్ ద్వారా టాలీవుడ్ పరువును హాలీవుడ్ దాకా ఇలాంటి కొందరు అభిమానులు తీసుకెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

మనకు పక్కింటోడితో గొడవ ఉంటే మన వీధిలోనే తేల్చుకోవాలి. అంతేకాని పక్క ఊరికి వెళ్లి అక్కడ సంబంధం లేని వాళ్ళ ముందు చేస్తే కామెడీ గా ఉంటుంది. తమ హీరో మీద అభిమానంతో తెలిసి తెలియని అమాయకత్వంతో ఇలాంటి చేష్టలు చేస్తున్న వాళ్ళను చూస్తే జాలి పడటం తప్ప చేయగలిగింది ఏమి లేదు. ప్రతి హీరోకు బలాలు, బలహీనతలు ఉంటాయి. వాళ్ళకు వాటి పట్ల ఎలాంటి ఈగోలు కాని సమస్యలు కాని ఉండవు. కాని ఫాన్స్ మాత్రం ఇలా సోషల్ మీడియా చేతిలో ఉంది కదా ఇలాంటి వాటికి పాల్పడితే వ్యక్తిగతంగా అభిమానుల పరువు పోదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా ప్రపంచానికి పరిచయం ఉండవు. కాని హీరోలు అలా కాదు. ఇలా చేసి వారికి కలిగించే ఉపయోగం ఏముండదు సరికదా ఫ్యాన్స్ అంటే నవ్వుకునే పరిస్థితి వస్తుంది.