Begin typing your search above and press return to search.

మహేష్.. ఏడుపొక్కటే తక్కువ

By:  Tupaki Desk   |   29 April 2018 6:57 AM GMT
మహేష్.. ఏడుపొక్కటే తక్కువ
X
గత కొన్ని రోజులుగా చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. వరుసగా రెండు భారీ డిజాస్టర్లు ఎదుర్కొని బాగా కుంగిపోయాడు మహేష్. ‘శ్రీమంతుడు’కు ముందు కూడా అతడికి రెండు డిజాస్టర్లు ఎదురయ్యాయి. అలాంటి స్థితిలో కొరటాల శివ అతడికి ఉపశమనాన్నిచ్చాడు. ఇప్పుడు మహేష్ మళ్లీ బాగా డౌన్ అయిన సమయంలో కొరటాల తీసిన ‘భరత్ అనే నేను’ మహేష్ కు గొప్ప ఊరటనిచ్చింది. ఈ నేపథ్యలో మహేష్ చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఏ వేదిక ఎక్కినా కొరటాల గురించి చాలా చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాడు. తాజాగా ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో మహేష్ బాబు మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. తన తండ్రి అభిమానులు.. తన అభిమానులు తనను సూపర్ స్టార్ అంటుంటారని.. కానీ ఆ సూపర్ స్టార్ వరుస డిజాస్టర్లలో ఉన్నపుడు కొరటాల రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడని.. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నాడు మహేష్. ఈ మాటలంటున్నపుడు మహేష్ లో ఉద్వేగం తన్నుకొచ్చింది. దాదాపుగా ఏడ్చినంత పని చేశాడు.

సక్సెస్ మీట్ మొత్తంలో కూడా మహేష్ చాలా ఎమోషనల్ గానే కనిపించాడు. అతడిలో చాలా అలసట కూడా కనిపించింది. ఇందుకు కారణం కూడా చెప్పాడు. యాంకర్ సుమ నుంచి మైక్ అందుకుంటూ.. ‘‘మీరు వెంటనే మైక్ ఇవ్వకపోతే పడిపోయేలాగున్నా.. ఎందుకంటే పది రోజులుగా శివగారు నన్ను పడుకోనివ్వట్లేదు. ప్రమోషన్ల కోసం తిరుగుతూనే ఉన్నా. ఐతే ఇది చాలా బాగుంది. ఇలాగే అన్ని సినిమాలకూ జరగాలని కోరుకుంటున్నా’’ అన్నాడు. ఈ వేడుకలో నటీనటులు.. టెక్నీషియన్లు అందరికీ షీల్డులివ్వడం చాలా బాగుందని.. ఇలా జరిగి ఎంత కాలమైందో అంటూ మరోసారి ఉద్వేగం చూపించాడు మహేష్. పోసాని.. జీవా.. బెనర్జీ లాంటి నటుల ముందు అసెంబ్లీ సీన్లో పెర్ఫామ్ చేయడం చాలా గర్వంగా ఉందన్నాడు మహేష్. ఇంతకుముందు ‘భరత్ అనే నేను’ థ్యాంక్స్ మీట్లో మాదిరే మరోసారి దానయ్యను మహేష్ అనుకరించాడు. ఇకపైనా ‘భరత్ అనే నేను’ తరహాలోనే అభిమానులకు నచ్చే సినిమాలే చేస్తానని అంత:కరణ శుద్ధితో చెబుతున్నానంటూ మహేష్ తన ప్రసంగాన్ని ముగించాడు.