Begin typing your search above and press return to search.

మహేశ్‌ ఇమేజ్‌ పై మాయని మచ్చ.?

By:  Tupaki Desk   |   28 Dec 2018 9:25 AM GMT
మహేశ్‌ ఇమేజ్‌ పై మాయని మచ్చ.?
X
“ట్యాక్స్‌ ఎగ్గొట్టిన సూపర్‌ స్టార్‌.. మహేశ్‌ కు నోటీసులు” ఈ వార్త వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజం. గురువారం సాయంత్రం బయటకు వచ్చిన ఈ న్యూస్‌ ని చాలాసేపు ఎవ్వరూ నమ్మలేదు. ఉదయం అన్ని పేపర్లలో ఫ్రంట్‌ పేజ్‌ లో, చాలా వైబ్‌ సైట్స్‌ లో వచ్చాక కానీ నమ్మక తప్పలేదు. ఎందుకంటే.. మహేశ్‌ పై ఇంత వరకు ఒక్కటంటే ఒక్క రూమర్‌ కూడా లేదు. అదీగాక మహేశ్‌ మనస్తత్వం అందరికి తెలుసు. అవసరం అయితే తప్ప బయటకు రాడు. వచ్చినా చాలా తక్కువ మాట్లాడతాడు. అన్నింటికి మించి సమాజ సేవ కోసం మహేశ్‌ ఎప్పుడూ ముందే ఉంటాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. వాటి బాగోగులు చూసుకుంటున్నాడు. అలాంటి మహేశ్‌ ట్యాక్స్ ఎగ్గొట్టాడంటే ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి. ఒక వేళ ఆ ట్యాక్స్‌ కూడా ఏదైనా కోట్లలో ఉందా అంటే అది కూడా కాదు. కేవలం రూ.73 లక్షల చిల్లర. ఇంత మొత్తాన్ని కట్టడం మహేశ్‌ కు చిటికె లో పని.

సాధారణంగా పెద్ద హీరోల కాల్షీట్లు అన్నీ మేనేజర్లు చూసుకుంటే.. ఆర్థిక వ్యవహారాలు, ట్యాక్యుల గలో అంతా ఆడిటర్ల పని. కనీసం తాము ఎంత ట్యాక్సు కడుతున్నామో కూడా చాలామంది స్టార్‌ హీరోలకు తెలీదు. అవన్నీ వారికి అనవసరం కూడా. అందుకే వారి తరపున ఆడిటర్లే చూసుకుంటారు. కానీ ఈసారి ఏమైందో ఏమో, ఆడిటర్లు ఎందుకు మిస్‌ అయ్యారో కానీ.. మచ్చ మాత్రం మహేశ్‌ పై పడింది. ఇంకా చెప్పాలంటే.. సూపర్‌ స్టార్‌ 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి నెగిటివ్‌ రిమార్క్ ఎప్పుడూ తెచ్చుకోలేదు. మహేశ్‌ కు అటు ఇండస్ట్రీలో ఇటు బయట గుడ్‌ బోయ్‌ ఇమేజే ఉంది.

ట్యాక్స్‌ మ్యాటర్‌ లోకి వస్తే.. 2007-08 సంవత్సరంలో మహేశ్‌ కొన్ని యాడ్స్‌ చేశాడు. ఆ యాడ్స్‌ కు సంబంధించి.. అప్పుడే ట్యాక్స్ కూడా కట్టేశాడు. ఎందుకంటే ఒక యాడ్‌ చేసేటప్పుడే.. ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది కూడా సదరు అగ్రిమెంట్‌ లో స్పష్టంగా ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాతే అగ్రిమెంట్స్‌ పై సంతకాలు జరుగుతాయి. కానీ సర్వీస్‌ ట్యాక్స్‌ విషయం మాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో ఆ నిబంధన ఉందన్న విషయం కూడా బహుశా మహేశ్‌ కు తెలిసి ఉండదు. ఎందుకంటే.. ఇవన్నీ మహేశ్‌ ఆడిటర్‌ చూసుకోవాలి. అలా అప్పటి నుంచి సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకపోవడం వల్ల.. మొత్తం కలిపి రూ.39 లక్షలు అయ్యింది. దానికి వడ్డీ కూడా కలుపుకుంటే.. మొత్తం రూ.73 లక్షల రూపాయలకు చేరింది. ఈ మొత్తంలో దాదాపు 43 లక్షలను మహేశ్‌ ఎక్కౌంట్‌ నుంచి తీసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని కట్టాలంటూ జీఎస్టీ కమిషనరేట్‌ నోటీసులు జారీ చేసింది.

అసలు ఇలా ట్యాక్స్‌ కట్టాలన్న విషయం పై మహేశ్‌ బాబు ఆడిటింగ్‌ టీమ్‌ కు జీఎస్టీ కమిషనరేట్‌ నోటీసులు జారీ చేసే ఉంటుంది. కానీ వాళ్లు నిర్లక్ష్యం చేయడం వల్ల.. ఈ అపనింద మహేశ్‌ పై పడంది. కనీసం ఈ విషయం ఒక్కసారి మహేశ్‌ చెవిన పడితే వెంటనే కట్టేసేవాడు. ఇంతవరకు తెచ్చుకునేవాడు కాదు. కోట్లు పెట్టి మల్టీప్లెక్స్‌ కట్టినోడికి.. రూ.73 లక్షలు ఒక లెక్కా చెప్పండి. కానీ ఈ న్యూస్‌ మీడియాలో రావడమే మహేశ్‌ కు కాస్త ఇబ్బందిగా మారింది. ఎప్పుడూ స్టార్‌ హీరోగా తన సినిమాలతో ఫ్రంట్‌ పేజీ వార్తల్లో నిలబడే మహేశ్‌.. ఈసారి ఇలాంటి న్యూస్‌ తో వార్తల్లో నిలవడం ఆయన ఇమేజ్‌ కు కొంచెం ఇబ్బందే. సూపర్‌ స్టార్‌ ఎలాంటివాడో అందరికి తెలుసు. అయినా కూడా ఒక బాధ్యతగల వ్యక్తిగా ఏం జరిగిందో చిన్న వీడియో రూపంలోనే, లేదంటే ట్విట్టర్‌ లోనే మహేశ్‌ చెప్పి.. ఈ ట్యాక్స్‌ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెడితే సరి.