Begin typing your search above and press return to search.

ఇక ముందూ మహేష్ ది ఇదే రూటు..

By:  Tupaki Desk   |   17 Aug 2015 3:50 PM GMT
ఇక ముందూ మహేష్ ది ఇదే రూటు..
X
ఒకప్పుడు మహేష్ బాబు రూటే సెపరేటు. సినిమాలు చేసేటపుడూ మాట్లాడేవాడు కాదు. విడుదలకు ముందూ మాట్లాడేవాడు కాదు. విడుదల తర్వాతా నోరు తెరిచేవాడు కాదు. సినిమా హిట్టయినా, ఫ్లాపైనా సైలెంటే. ఐతే నమ్రత తన జీవితంలోకి వచ్చాక మహేష్ చాలా మారాడు. నెమ్మదిగా బయటికి రావడం మొదలుపెట్టాడు. చాలా బ్రాండ్లకు ప్రచారం చేస్తూ జనాల్లో తిరిగాడు. అయినప్పటికీ తన సినిమాల్ని ప్రమోట్ చేయడం తక్కువే. 1 నేనొక్కడినే, ఆగడు సినిమాల్ని పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. ఆగడు సినిమా సంగతి పక్కనబెట్టేస్తే 1 నేనొక్కడినే లాంటి మంచి సినిమాను మహేష్ బాగా ప్రమోట్ చేస్తే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఈ మాట మహేష్ చెవిన పడటం వల్ల మార్పొచ్చిందో లేక నిర్మాతగా మారడం వల్ల వచ్చిన అక్కరో కానీ.. ‘శ్రీమంతుడు’ సినిమాను విడుదలకు ముందు, తర్వాత చాలా బాగా ప్రమోట్ చేశాడు ప్రిన్స్.

అతను ప్రమోట్ చేయడం వల్లే సినిమా ఆడేస్తోందనడానికేమీ లేదు కానీ.. సినిమా రేంజి పెరగడానికి ఇది ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. ఐతే ఈ ప్రమోషన్ ప్లానింగ్ మొత్తం నమ్రతదేనట. శ్రీమంతుడు ప్రొడక్షన్ వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించిన నమ్రత.. ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం ఏ టీం ఏర్పాటు చేసుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసిందట. ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొనాలి, సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి? ఇంటర్వ్యూల ప్లానింగ్ అంతా కూడా నమ్రతే చూసుకుందట. ఈ ప్లానింగ్ మంచి ఫలితాన్నివ్వడంతో ఇక మహేష్ ప్రతి సినిమాకూ ఇలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. మహేష్ నిర్మాతగా ఉన్నా లేకున్నా.. తన వంతుగా సినిమాను ప్రమోట్ చేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడట. ప్రమోషన్ వాల్యూ ఏంటో ఇప్పుడే తనకు తెలిసొచ్చిందని మహేష్ అనడాన్ని బట్టే ఇక మహేష్ తన సినిమాల్ని ఎలా ప్రమోట్ చేయబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.