Begin typing your search above and press return to search.

మ‌హేష్ న‌మ్మ‌క‌మే గెలిచిందా?!

By:  Tupaki Desk   |   8 Aug 2015 7:18 AM GMT
మ‌హేష్ న‌మ్మ‌క‌మే గెలిచిందా?!
X
ఒక ఊరు. ఆ ఊళ్లో విల‌ను. ఎక్క‌డో ఉన్న హీరోకి త‌న ఊరు గుర్తుకొచ్చి మంచి చేయాల‌నుకొంటాడు. విల‌న్ మాత్రం య‌థావిధిగా అడ్డుకొంటాడు. హీరో అత‌న్ని ఖ‌త‌మ్ చేసి ఊరికోసం నిల‌బ‌డ‌తాడు. ఇలాంటి క‌థ‌ల్ని ఎన్ని సినిమాల్లో చూడ‌లేదు. కానీ కొర‌టాల శివ మాత్రం మోడ్ర‌న్‌ గా ఆలోచించి ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డ‌మంటే రంగులు, రోడ్లేసి వెళ్లిపోవ‌డం కాదు.. ఆ ఊరి మంచి చెడుల్ని కూడా ద‌త్తత తీసుకోవాల‌నే సూత్రం చుట్టూ క‌థని అల్లేశాడు. నిజానికి ఇదొక ఆర్ట్ సినిమాకి సంబంధించిన స‌బ్జెక్టు. క‌మ‌ర్షియ‌ల్ కోణంలో కొత్త పుంత‌లు తొక్కుతున్న తెలుగు సినిమాల్లో ఇలాంటి క‌థ‌ని అస్స‌లు ఊహించ‌లేం. ఒక‌వేళ క‌థ ఉన్నా అది క‌మ‌ర్షియ‌ల్ అంశాల మాటున ఎక్క‌డో అడుగున క‌నిపిస్తుంటుంది. కానీ కొర‌టాల శివ మాత్రం క‌థ‌ని క‌థ‌గా తీసే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌హేష్ కూడా క‌థ‌ని అలాగే న‌మ్మాడు. ఇప్పుడు ఆయ‌న న‌మ్మ‌క‌మే గెలిచింది. నిజాయ‌తీగా ఒక క‌థ‌ని న‌మ్మి సినిమా తీస్తే విజ‌యంక‌ట్ట‌బెడ‌తార‌ని మ‌హేష్ ఎలా న‌మ్మాడో కానీ... అదే నిజ‌మైంది. ఈ సినిమా ద‌ర్శ‌కుల‌కి, క‌థానాయ‌కుల‌కి కొత్త దారుల్ని చూపించేలా ఉంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిజానికి శ్రీమంతుడు ఏ ద‌శ‌లోనే అంచ‌నాల‌కి అంద‌ని విధంగా వెళ్ల‌దు. క‌థ మ‌నం ఊహించిన‌ట్టే వెళుతుంటుంది. ఢిల్లీలో మినిస్ట‌ర్ త‌న త‌మ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన‌ప్పుడే క‌థంతా అర్థ‌మైపోతుంది. ఆ త‌ర్వాత అంతా ముగింపు ఎలా ఉంటుంద‌నే ఎదురు చూస్తారు. ఆ ముగింపు కూడా కొత్త‌గా ఏమీ లేదు. రొటీన్‌ గా ప్ర‌తీ సినిమాలో హీరో విల‌న్ని చంపేసిన‌ట్టే ఇందులోనూ చంపేస్తాడు. కాక‌పోతే ఎప్ప‌టిక‌ప్పుడు ఎమోష‌న్స్‌ ని బ‌లంగా పండించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ప్రీ క్లైమాక్స్‌ లో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట్లో మ‌హేష్ చెప్పే డైలాగులు, తండ్రితో పాటు ఇంటికి వెళ్లి అక్క‌డ చెప్పే డైలాగులు బ‌ల‌మైన భావోద్వేగాల్ని పండించాయి. మ‌హేష్ ఎప్పుడూ త‌న సినిమాల‌తో ఓ కొత్త విష‌యాన్ని చాటి చెబుతుంటాడు. ఆయ‌న ఎంచుకొనే క‌థ‌లు ఇత‌ర క‌థానాయ‌కుల‌కు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. `మురారి`, `ఒక్క‌డు`, `అర్జున్‌`, `పోకిరి`, `దూకుడు`... ఇలా ఏ సినిమానైనా తీసుకోండి. ఆ త‌ర్వాత కూడా ఇదే త‌ర‌హా క‌థ‌ల్ని ఎంచుకొని చేశారు చాలామంది క‌థానాయ‌కులు. `శ్రీమంతుడు`తో మ‌హేష్ చేసిన ప్ర‌య‌త్నం మాత్రం క‌థానాయ‌కుల‌కే కాకుండా ద‌ర్శ‌కుల‌కు కూడా కొత్త ఉత్సాహాన్ని నూరిపోసిన‌ట్ట‌యింది.