Begin typing your search above and press return to search.

వైయస్ మాట.. మహేష్ నోట..!

By:  Tupaki Desk   |   2 May 2022 2:58 PM GMT
వైయస్ మాట.. మహేష్ నోట..!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మే 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సోమవారం సాయంత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు.

సుమారు 2.36 నిమిషాల నిడివితో ఉన్న 'సర్కారు వారి పాట' ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత కొంతకాలంగా సబ్టిల్ రోల్స్ చేస్తూ వస్తోన్న మహేష్ బాబు.. ఒక్కసారిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. వింటేజ్ మహేష్ ను గుర్తు చేశారు.

లవ్, కామెడీ, మాస్, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలు కలబోసిన 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. అయితే ఇందులో మహేశ్ బాబు చెప్పిన ఒక డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

SVP ట్రైలర్ లో 'మీరు నాకొక 10000 డాల‌ర్స్ అప్పిస్తే.. ఎగ్జామ్ ఫీజ్ క‌ట్టి టాప్ స్కోర్ చేస్తాను' అని హీరోయిన్ కీర్తి సురేష్ అడుగుతుంది. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిన మహేష్.. చేతులు పట్టుకుని 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అని అంటాడు. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అని ప్రజలకు వాగ్దానం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ బయోపిక్ గా తెరకెక్కిన 'యాత్ర' సినిమాలోనూ ఈ డైలాగ్ ను ఉపయోగించారు.

2019 ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ డైలాగ్ తోనే జనాల్లోకి వెళ్లారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి మరియు జగన్ చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలు.. ఇప్పుడు మహేష్ నోట వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

సూపర్ స్టార్ అభిమానులు మరియు వైసీపీ కార్యకర్తలు కొందరు వైయస్ వీడియోను.. మహేశ్ బాబు డైలాగ్‌ వీడియోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసేస్తున్నారు. వైయస్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే మహేష్ ఇలాంటి డైలాగ్ చెప్పడంలో ఆశ్చర్యం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేందర్ రెడ్డి ట్వీట్‌ చేస్తూ.. 'నేను విన్నాను-నేను ఉన్నాను' అని నాడు పాదయాత్ర లో జగనన్న మాట.. అధికారంలోకి వచ్చిన తరువాత అడుగడుగునా అక్షరసత్యం చేసి చూపించాడు. నేడు అదే మాట ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన సినిమాలో ఫాలో అయ్యేంతలా ఇంపాక్ట్ క్రీయేట్ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఎంతైనా జగనన్న ట్రెండ్ సెట్టర్ అని పేర్కొన్నారు.

సాధారణంగా రాజకీయ నాయకులు తమ మీటింగ్స్ లో స్పీచ్ లలో సినిమాల డైలాగులు.. హీరోల మ్యానరిజమ్స్ అనుకరించడం చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు భిన్నంగా మహేష్ బాబు లంటి స్టార్ హీరో రాజకీయ నాయకుల డైలాగ్ ను చెప్పారు.

నిజానికి మహేశ్ బాబు తండ్రి నటశేఖర కృష్ణ.. కాంగ్రెస్ పార్టీకి అభిమాని. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు నియోజకవర్గం నుంచి 1989లో లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 1991 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు.

ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ వస్తున్న కృష్ణ.. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మహేశ్ సైతం పలు సందర్భాల్లో వైయస్సార్ తో ముచ్చటించారు.

అలానే వైయస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత.. ఇటీవల టాలీవుడ్ సమస్యలపై పలువురు సినీ ప్రముఖులతో కలిసి జగన్ తో భేటీ అయ్యారు మహేష్. ఆ తర్వాత ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇకపోతే మహేశ్ బావ గల్లా జయదేవ్ మాత్రం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.