Begin typing your search above and press return to search.

నాగ్ షోలో మహేష్ కనిపిస్తే...

By:  Tupaki Desk   |   28 March 2016 10:25 AM GMT
నాగ్ షోలో మహేష్ కనిపిస్తే...
X
బాలీవుడ్డోళ్లు మహా తెలివైన వాళ్లు. సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో వారి స్టయిలే వేరు. షారుఖ్ కు సల్మాన్ ఖాన్ తో పడకపోయినా సరే తన కొత్త సినిమా విడుదలవుతుంటే కచ్చితంగా ‘బిగ్ బాస్’ షోకు వస్తాడు. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. అలాగే ‘బిగ్ బాస్’ షోకు కూడా అది బాగానే పనికొస్తుంది. ఈ తెలివి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ జనాలకు కూడా అలవాటవుతోంది. బుల్లి తెరను తక్కువగా చూడకుండా ఉభయతారకంగా ఉండేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ‘బిగ్ బాస్’ తరహాలో సినిమాల ప్రమోషన్లకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మంచి వేదికగా నిలుస్తోంది. గతంలో ప్రమోషన్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించని జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ కు ముందు ఎంఈకే షోకు వచ్చాడు.

నాగ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎంఈకే షో సూపర్ హిట్టయింది. ఆ ఎపిసోడ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీఆర్పీ రేటింగులూ వచ్చాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రమోషన్ కు సైతం అది బాగా ఉపయోగపడింది. ఐతే ఈ షోకు మహేష్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మామూలుగా నాగ్ తో మంచి సంబంధాలున్నవారే ఈ షోకు వస్తారు. మహేష్ కు నాగ్ మీద.. నాగ్ కు మహేష్ మీద చాలా అభిమానంతో పాటు గౌరవం ఉన్నాయి.

నాగ్ మహేష్ కోసం ‘రాజకుమారుడు’ ఓపెనింగ్ కు వస్తే.. మహేష్ అఖిల్ కోసం ‘అఖిల్’ ఆడియో వేడుకకు వచ్చాడు. ఇటీవల సోగ్గాడే చిన్నినాయనాతో పాటు ‘ఊపిరి’ విషయంలో మహేష్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఊపిరి’ విషయంలో ఫోన్ చేసి 20 నిమిషాలకు పైగా మాట్లాడాడట. ‘ఊపిరి’ తీసిన పీవీపీ బేనర్లోనే మహేష్ ‘బ్రహ్మోత్సవం’ చేస్తున్నాడు. మహేష్.. నాగ్.. ఇద్దరికీ పీవీపీతో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు కొత్త సీజన్ నడుస్తుంటే.. దానికి మహేష్ అతిథిగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే ఆ రోజు టీఆర్పీ రేటింగ్ విషయంలో కొత్త రికార్డులు నమోదవడం ఖాయం.