Begin typing your search above and press return to search.

మ‌హేష్‌ కు ఆ సెంటిమెంట్ లేదా!

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:03 PM IST
మ‌హేష్‌ కు ఆ సెంటిమెంట్ లేదా!
X
స్టార్ హీరో సినిమా... అదీ ఏ పండ‌క్కో - వేస‌వి సెల‌వుల‌తో రిలీజైతే ఆ కిక్కే వేరు. సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే ఆ క‌లెక్ష‌న్ల రేంజే వేరు. ఎన్టీఆర్‌ - ఏయ‌న్నార్ జ‌మానా నుంచీ చిరంజీవి - బాల‌య్య‌ - నాగార్జున - వెంక‌టేష్‌ వంటి హీరోల వ‌ర‌కూ అంద‌రూ ఫాలో అయిన ట్రెండ్ ఇది. సినిమా హిట్ట‌వ్వ‌డం ఎంత ముఖ్య‌మో అదే రేంజిలో క‌లెక్ష‌న్లు వచ్చి, సినిమాకి ప‌నిచేసిన‌వాళ్ల‌తోపాటు థియేట‌ర్ల‌వాళ్లూ సంతోషంగా ఉండ‌ట‌మూ అంతే ముఖ్యం. కానీ, ఈ ఫార్ములాని ప్రిన్స్ మ‌హేష్ బాబు మాత్రం ఫాలో అవుతున్న‌ట్టు లేదా అంటే అవుననే అంటున్నారు సినీ పండితులు!! "సంభ‌వామి" సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌య‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు విశ్లేష‌కులు.

సినీ న‌టులు ఎక్కువ‌గా న‌మ్మ‌కాల‌మీద ఆధార‌ప‌డి ఏ ప‌నైనా చేస్తుంటారు. అలాగే మ‌హేష్‌ బాబు కూడా ఒక‌ప్పుడు వీటిని ఫాలో అయ్యేవాడు. అందుకే "ఒక్క‌డు" సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేశాడు. "పోకిరి"ని వేస‌వి సెల‌వుల్లోనూ - "దూకుడు" ద‌స‌రాకూ రిలీజయ్యాయి.. భారీ విజ‌యాలు సాధించాయి.. బ్లాక్‌ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. అయితే, ఇదే న‌మ్మ‌కం కొన్ని సినిమాల విష‌యంలో నిజం కాలేదు. అందుకు ఉదాహ‌ర‌ణ... "1 నేనొక్క‌డినే" - "బ్ర‌హ్మోత్స‌వం" - "ఆగ‌డు" వంటి సినిమాలే.

దీంతో పండుగ‌ల సెంటిమెంట్‌ ను బ్రేక్ చేస్తూ "శ్రీ‌మంతుడు" సినిమాను 2015లో ఆగ‌స్టులో రిలీజ్ చేశాడు. అది అనూహ్య విజ‌యం సాధించింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. దాంతో, మ‌హేష్‌... ఈ రిలీజ్ డేట్ల సెంటిమెంట్‌ ను ఫాలో అవ‌డం లేద‌ట‌. అయితే, దీన్ని సెంటిమెంట్ అనే కంటే బిజినెస్ కోణంలోనే చూడాల్సిన అవ‌సరం ఎక్కువ ఉందనేవారు ఎక్కువగానే ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు... గ‌తేడాది సంక్రాంతికి బాల‌య్య న‌టించిన "డిక్టేట‌ర్‌" - ఎన్టీఆర్ న‌టించిన "నాన్న‌కు ప్రేమ‌తో" విడుద‌ల‌య్యాయి. నిజానికి అవి రెండూ మామూలు రోజుల్లో రిలీజైతే క‌లెక్ష‌న్లు ఆ స్థాయిలో వ‌చ్చి ఉండేవి కావనే చెప్పాలి. అగ్ర‌న‌టుల సినిమాలు కాబ‌ట్టి, పండుగ‌కు రిలీజ‌య్యాయి కాబ‌ట్టి ప్రేక్ష‌కులంతా మాసూ క్లాసూ అనే తేడా లేకుండా అంద‌రూ వాటిని చూశారు.

అయితే.. మ‌హేష్ ప్రస్తుతం చేస్తున్న "సంభ‌వామి" సినిమా వేస‌వి సెల‌వుల్లో రిలీజ్ కావ‌డం లేదు. అందుకు కార‌ణం... అప్ప‌టికి "బాహుబ‌లి - 2" రిలీజ్ అవుతుండ‌ట‌మే. దాంతో క్లాష్ అవ‌డం ఇష్టం లేక‌, స‌మ్మ‌ర్ హాలిడేస్ అయిపోయాక జూన్ మూడోవారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారట. ఈ నిర్ణ‌యాన్ని విశ్లేష‌కులే కాదు - మ‌హేష్ అభిమానులు కూడా త‌ప్పుబ‌డుతున్నారు. స‌రిగ్గా స్కూళ్లూ కాలేజీలూ ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి సినిమా రిలీజైతే ఈ సినిమాకు భారీ క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తాయ‌ని వారు ప్ర‌శ్నిస్తుండటంతో పాటు.. మ‌హేష్ ఇప్ప‌టికైనా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని వారు కోరుకుంటున్నారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/