Begin typing your search above and press return to search.

రాజకుమారుడు.. బాబుకు నచ్చలేదు

By:  Tupaki Desk   |   23 May 2016 6:37 AM GMT
రాజకుమారుడు.. బాబుకు నచ్చలేదు
X
టాలీవుడ్లో ఇంకెవరి ప్రమేయం లేకుండా తనే సినిమాల్ని ఎంచుకునే హీరోల్లో మహేష్ బాబు ఒకడు. అతనే కథ వింటాడు. నచ్చితే అప్పటికప్పుడు ఓకే చేస్తాడు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. హిట్లొచ్చినా.. ఫ్లాపులొచ్చినా.. అందుకే తనదే బాధ్యత అంటుంటాడు మహేష్. అలాంటి వాడు హీరోగా తన తొలి సినిమా విషయంలో తన ప్రమేయం ఏమీ లేదంటున్నాడు. అసలు ‘రాజకుమారుడు’ కథే తనకు నచ్చలేదని చెబుతున్నాడు. కేవలం నాన్న మాటను కాదనలేక రాఘవేంద్రరావును నమ్మి ఆ సినిమా చేశానని చెప్పి ఆశ్చర్యపరిచాడు మహేష్ బాబు.

‘‘నాకు రాజకుమారుడు టైపు సినిమాలు నచ్చవు. ఆ కథ చెబుతున్నపుడు మనకు ఇలాంటి సినిమాలేంటి అనిపించింది. ఐతే రాఘవేంద్రరావుగారి మీద నమ్మకంతోనే గుడ్డిగా ఆ సినిమా చేశాను. నాకు ఆయన బాగా క్లోజ్. మావయ్యా మావయ్యా అనేవాణ్ని. రాఘవేంద్రరావు గారు.. అశ్వనీదత్ గారు.. ఇంకొందరు గదిలో కూర్చుని ఉండగా ఆ కథ చెప్పారు. ఐతే కథ నరేట్ చేస్తున్నపుడు నేను ఏమాత్రం ఏకాగ్రత పెట్టలేదు. ఫోన్లో ఏదో చూసుకుంటూ ఆసక్తి లేనట్లు ప్రవర్తించాను. ఐతే కథంతా చెప్పాక రాఘవేంద్రరావు గారు నాతో పర్సనల్ గా ఓ మాట అన్నారు. నీకు కథ నచ్చకపోయినా సరే.. నచ్చినట్లు యాక్ట్ చేయాలి. లేదంటే దర్శకుడిగా నాకు కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పారు. సినిమా షూటింగ్ టైంలో కూడా ఈ సీన్ వర్కవుటవుతుందా అని రాఘవేంద్రరావు గారితో వాదించేవాడిని. అయితే ఆయన నన్ను నమ్ము అనేవారు. ఐతే ఆ నమ్మకం నిజమైంది. సినిమాకు మంచి రిజల్ట్ వచ్చింది’’ అని మహేష్ చెప్పాడు.