Begin typing your search above and press return to search.

మొత్తానికి ఆల‌స్యం అయినా మ‌హేష్ స్పందించాడు

By:  Tupaki Desk   |   9 March 2022 6:16 AM GMT
మొత్తానికి ఆల‌స్యం అయినా మ‌హేష్ స్పందించాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌త కొన్ని నెల‌ల క్రితం సినిమా టికెట్ ల రేట్ల‌పై స‌రికొత్త జీవో 35ని తీసుకురావ‌డంతో పెద్ద చిత్రాలు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయి. టికెట్ రేట్లు పెంచుకోవ‌డానికి వీళ్లేదంటూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో పెద్ద చిత్రాలు న‌ష్టాల‌తో పాటు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. అయితే ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించండి అంటూ చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం తెలిసింది.

దీనిపై ఆల‌స్యంగా స్పందించిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా 35 జీవోని స‌వ‌రిస్తూ పెద్ద చిత్రాలు టికెట్ రేట్ల‌ని పెంచుకునే వెసులుబాటుని క‌ల్పిస్తూ కొత్త జీవోని విడుద‌ల చేసింది. అయితే ఇందులో స‌రికొత్త మెలిక‌లు పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ఈ జీవో వ‌ల్ల ఎవ‌రికీ అంతగా ఉపయోగం వుండే అవ‌కాశం లేద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు పెద‌వి విరుస్తున్నారు. ఏపీలో 20 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిపిన చిత్రాల‌కు మాత్ర‌మే తాజా జీవో వ‌ర్త‌స్తుంద‌ని,

అంతే కాకుండా 100 కోట్ల‌కు మించి బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రాల‌కు ఈ జీవో ఉప‌క‌రిస్తుంద‌ని కొత్త జీవోలో మెలిక‌లు వుండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

సోమ‌వారం హ‌డావిడిగా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఈ జోవో పై టాలీవుడ్ నుంచి పెద్ద‌గా స్పంద‌న లేదు. మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్, ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి మిన‌హా దీనిపై ఎవ‌రూ స్పందించ‌లేదు. తాజాగా అంటే కాస్త ఆల‌స్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పందించారు. `మా విన్న‌పాలు విని దానికి త‌గ్గ‌ట్టుగా టికెట్ రేట్ల‌ని పెంచుతూ కొత్త జీవోని విడుద‌ల చేసినందుకు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌తులు` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు మ‌హేష్‌.

అంతే కాకుండా మున్ముందు కూడా ఇలానే ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వం, చిత్ర ప‌రిశ్ర‌మ ఎంతో స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు. ఇదిలా వుంటే సోమ‌వారం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని అభినందిస్తూ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ స‌భ్యులు ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సి. క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ ప్ర‌భుత్వం మా విన్న‌పానికి సానుకూలంగా స్పందించినందుకు వారికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ల‌ని తెలియ‌జేసిన సి. క‌ల్యాణ్ ఇదే జీవోని `భీమ్లానాయ‌క్‌` రిలీజ్ కు ముందు ప్ర‌క‌టించిన వుంటే ఇంకా బాగుండేద‌ని ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత ప్రోత్సాహాన్ని అందించాల‌ని, త్వ‌ర‌లో నే ఇద్ద‌రు సీఎంల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ఈ సంద‌ర్భంగా సి. క‌ల్యాణ్ వెల్ల‌డించారు. అయితే వీరు త‌ప్ప మ‌రెవ‌రూ ఏపీ జీవోపై స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.