Begin typing your search above and press return to search.

బ‌ర్త్‌ డే స్పెష‌ల్‌:అంతా నాన్నే అంటున్న మ‌హేష్‌

By:  Tupaki Desk   |   9 Aug 2015 5:11 AM GMT
బ‌ర్త్‌ డే స్పెష‌ల్‌:అంతా నాన్నే అంటున్న మ‌హేష్‌
X
మ‌హేష్‌ బాబు ఓ సూప‌ర్‌ స్టార్‌. రీజ‌న‌ల్ ఇండస్ట్రీలో ఉంటూ కేవ‌లం రీజ‌న‌ల్ సినిమాలు మాత్ర‌మే చేస్తూ నేష‌న‌ల్ వైడ్‌ గా గుర్తింపు తెచ్చుకొన్న అరుదైన హీరో. అమెరికాలో మ‌హేష్ సినిమా విడుద‌ల‌వుతోందంటే అక్క‌డి ఇంగ్లీష్ సినిమాలు సైతం షేక్ అయ్యే ప‌రిస్థితి. ఆయ‌న న‌టించిన ఐదు సినిమాలు అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌ ని దాటాయంటే మ‌హేష్‌ బాబుకి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. బాలీవుడ్‌ లో అడుగు పెట్టుంటే మ‌హేష్ ఇంకేస్థాయిలో అద‌ర‌గొట్టేవాడో మ‌రి! ప్రిన్స్‌ గా అభిమానుల నీరాజ‌నాలు అందుకొంటున్న మ‌హేష్ మాత్రం తాను ఎంత ఎత్తుకి ఎదిగినా సింపుల్‌ గా అదే చిరున‌వ్వుతో, అదే యాటిట్యూడ్‌ తో క‌నిపిస్తుంటాడు. అదెలా సాధ్యం అంటే నాన్న‌గారే అని చెబుతారు. నా జీవితంలో ప్ర‌తిదీ నాన్న‌గారు డిజైన్ చేసిందే అనేది మ‌హేష్ మాట‌. ఇప్ప‌టికీ కొత్త సినిమా విడుద‌ల‌య్యాక ఎలా ఉందో కృష్ణ చూసి చెబితే విన‌డం మ‌హేష్‌ కి అల‌వాటు.

ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకొంటున్న మ‌హేష్‌ బాబు ఓ ఇంట‌ర్వ్యూ లో త‌న ప్ర‌యాణం గురించి మాట్లాడుతూ నాన్న‌నే గుర్తు చేసుకొన్నాడు. ``తొలినాళ్ల‌లో సినిమాల్లో న‌టించ‌మ‌ని అడిగితే దాక్కునేవాణ్ని. ఆ త‌ర్వాత నాన్న‌గారే మెల్ల‌మెల్ల‌గా సినిమాల‌కి అల‌వాటు చేశారు. కొన్నాళ్ల‌కి న‌ట‌న‌పై నాకూ మ‌క్కువ పెరిగింది. సెల‌వులొస్తే చాలు.. నాన్న‌గారితో పాటు సెట్‌ కి వెళ్లేవాణ్ని. స‌మ్మ‌ర్ హాలీడేస్‌ లో నాతో సినిమా చేయించేందుకు నాన్న ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసేవారు. అయితే సినిమాల వ‌ల్ల మ‌ధ్య‌లో ఒక యేడాది చ‌దువు దెబ్బ‌తింది. దీంతో నాన్న‌గారే `చ‌దువు పూర్త‌య్యాక న‌టిద్దువులే... వెళ్లి చ‌దువుకో` అన్నారు. నాన్న‌గారు చెప్పిన‌ట్టే మ‌ళ్లీ కాలేజీకి వెళ్లిపోయా. చ‌దువు పూర్త‌వ్వ‌గానే `రాజ‌కుమారుడు` చేశా. అలా నా ఎంట్రీ చాలా సింపుల్‌ గా జ‌రిగింది. సినిమాల‌కోస‌మ‌ని మ‌ధ్య‌లో ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. వ‌చ్చా, న‌టించా. నేనేం చేసినా, ఎంత గుర్తింపు తెచ్చుకొన్నా అంతా నాన్న‌గారి చ‌ల‌వే. హీరోగా కూడా హిట్టొచ్చినా, ఫ్లాపొ చ్చినా ఎప్పుడూ ఒకలాగే ఉండ‌టానికి కార‌ణం కూడా నాన్న‌గారే. బ‌య‌ట ఆయ‌న సినిమాల ప‌రిస్థితేంటో మాకు తెలిసేది కాదు. ఇంట్లో మాతో మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఒక‌లాగే గ‌డిపేవారు. అదే మాకు అల‌వాటైంది`` అని చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.