Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ః సోషియో పొలిటికల్ స్పైడర్

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:55 AM GMT
టీజర్ టాక్ః సోషియో పొలిటికల్ స్పైడర్
X
మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ మొదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో అభిమాలు రెండు ఫస్ట్ లుక్స్.. ఒక టీజర్ గ్లింప్స్ మాత్రమే చూశారు. టీజర్ గ్లింప్స్ కొత్తగా అనిపించినప్పటికీ.. సినిమాలోని దృశ్యాలతో పూర్తి స్థాయి టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు ప్రేక్షకులు. ఎట్టకేలకు వాళ్ల ఎదురు చూపులకు తెరపడింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ ఉదయం ‘స్పైడర్’ టీజర్ వచ్చేసింది. సామాజికాంశాల నేపథ్యంలోనే కమర్షియల్ కథల్ని పకడ్బందీగా చెప్పడంలో నేర్పరి అయిన మురుగదాస్.. ‘స్పైడర్’ను కూడా ఆ తరహాలోనే తీర్చిదిద్దినట్లున్నాడు. జనాల్ని భయపెట్టడంలోనే పైశాచిక ఆనందాన్ని వెతుక్కునే ఒక వినాశక శక్తిని ఎదుర్కొనే రక్షకుడి కథలా కనిపిస్తోంది ‘స్పైడర్’.

‘‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయడానికి ఈ గవర్నమెంట్.. భూకంపం.. సునామీలా నేను కూడా ఒక భాగమే అంటూ విలన్ సాగించే విధ్వంసాన్ని కళ్లకు కట్టడంతో మొదలవుతుంది ‘స్పైడర్’ టీజర్. ఇలా విలన్ తనను తాను పరిచయం చేసుకున్నాక.. ‘‘నీలాంటోడు ఉన్న ఊరిలోనే ఇలాంటోడు కూడా ఒకడుంటాడు’’ అంటూ విలన్ని కౌంటర్ చేసే హీరోను చూపించాడు మురుగదాస్. మహేష్ ఎంట్రీని సినిమాలో చూపించినట్లే డాజ్లింగ్ గా చూపించడం టీజర్ లోని ప్రత్యేకత. మహేష్-రకుల్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కు సంబంధించి కూడా ఒక గ్లింప్స్ ఇచ్చారు. ‘‘భయం.. అది పుట్టించిందెవరు.. మేమే’’ అని విలన్ అంటే.. ‘‘ఆ రోజు అంతమంది జనంలోనూ దాక్కున్నావే అదే భయం.. భయపెట్టడం మాకూ తెలుసు’’ అంటూ మహేష్ టీజర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ డైలాగ్ చెప్పేటపుడు మహేష్ టైమింగే కాదు.. అతడి లుక్ కూడా అదిరిపోయింది.

సినిమా చాలా రిచ్ గా.. స్టైలిష్ గా ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సంతోష్ శివన్ విజువల్స్.. హ్యారిస్ జైరాజ్ నేపథ్య సంగీతం కూడా టీజర్ కు ఆకర్షణగా నిలిచాయి.

‘స్పైడర్’ సినిమా ఎందుకింత ఆలస్యమైందో కూడా టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఇందులో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నది స్పష్టం. భారీగా ఉన్న గుండు జనాల మీదికి దూసుకొచ్చే సీన్ అందుకు ఉదాహరణ. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే.. హీరో క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవుతుందని నమ్మే మురుగదాస్.. ‘స్పైడర్’ను కూడా ఆ తరహాలోనే తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా మాత్రమే పరిచయమున్న ఎస్.జె.సూర్యను నటుడిగా.. అందులోనూ లీడ్ విలన్ పాత్రలో చూడబోతుండటం కొత్త అనుభూతిని పంచేదే. ఎస్.జె.సూర్య పాత్ర చాలా శక్తిమంతంగా.. హీరోకు సవాలు విసిరేలా కనిపిస్తోంది. మహేష్ డేరింగ్ అండ్ డాషింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసినట్లే ఉన్నాడు. మహేష్ లుక్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది.

ఈ సినిమాలో సోషల్ పొలిటికల్ అంశాలను మురుగుదాస్ గట్టిగానే టచ్ చేసినట్లున్నాడు. దాక్కున్న ఆ విలన్ ను భయపెట్టి.. అతనికి వార్నింగ్ ఇచ్చే సీన్లో మహేష్‌ భలే ఉన్నాడు. మొత్తానికి మురుగదాస్ అండ్ మహేష్‌ కాంబో చాలా సరికొత్త సినిమాను ఆవిష్కరించారని అర్దమవుతోంది.

మన దగ్గర ఎంతసేపూ ఒక సినిమా హిట్టయితే మళ్లీ నాలుగు సినిమాల్లో పంచ్ డైలాగులే. అలాంటిది ఇప్పుడు మహేష్‌ ఇలా కొత్తగా ఒక సోషియో పొలిటికల్ డ్రామాతో వస్తుంటే.. ఖచ్చితంగా 'స్పైడర్' డిఫరెంట్ గా ఉంటూ పెద్ద హిట్టవుతుందేమో అనిపిస్తోంది. మొత్తానికి ‘స్సైడర్’ టీజర్ అంచనాలకు తగ్గట్లే ఉండి.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.