Begin typing your search above and press return to search.

స్పైడర్ వంద రోజులు ఆడిందటగా..

By:  Tupaki Desk   |   5 Jan 2018 1:00 AM IST
స్పైడర్ వంద రోజులు ఆడిందటగా..
X
ఈ దసరా పండక్కి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘స్పైడర్’ సినిమా అంతిమంగా ఏమైందో తెలిసిందే. చెత్త సినిమా కాకపోయినప్పటికీ మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిందీ చిత్రం. దసరా సెలవుల్లో సైతం ఈ చిత్రానికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. రెండు వారాలు తిరిగేసరికి సినిమా అడ్రస్ లేకుండా పోయింది. మూడో వారం నుంచి సినిమాను అందరూ మరిచిపోయారు.

ఇలాంటి సినిమా వంద రోజులు ఆడిందంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర పీఆర్వో బీఏ రాజు. నెల్లూరు జిల్లాలోని కోట పట్టణంలో రామ్ రాజ్ అనే థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో ‘స్పైడర్’ వంద రోజులు ఆడిందట. వంద రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఆడుతున్న సందర్భంగా మహేష్ బాబుకి.. ప్రేక్షకులకు.. మహేష్ బాబు, కృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది థియేటర్ యాజమాన్యం. ఐతే ఈ రోజుల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా 50 రోజులు ఆడటమే గగనంగా ఉంది. వంద రోజులంటే ఇక చెప్పాల్సిన సంగతే లేదు.

ఇంతకుముందు మహేష్ బ్లాక్ బస్టర్ సినిమా ‘శ్రీమంతుడు’ ఆడిందంటేనే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇక ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్ 100 డేస్ అంటే ఏం మాట్లాడాలి? ఇలా వంద రోజుల పోస్టర్లు వేస్తే జనాలు నవ్వుకుంటున్నారు. బాలయ్య సినిమా ‘లెజెండ్’ సినిమా అయినా ఏకంగా ఒక థియేటర్లో వెయ్యి రోజులు ఆడిందని గొప్పలు పోయారు. కానీ ఈ సినిమాలు ఎలా అన్నేసి రోజులు ఆడుతున్నాయన్న సంగతి జనాలకు తెలియంది కాదు.