Begin typing your search above and press return to search.

ఆగడు బాధ.. బాహుబలి టెన్షన్

By:  Tupaki Desk   |   14 Sep 2015 7:30 AM GMT
ఆగడు బాధ..  బాహుబలి టెన్షన్
X
సినిమా వాళ్లకు హిపోక్రసీ ఎక్కువ. ఫ్లాప్ అయిన తమ సినిమాల గురించి కానీ.. సూపర్ హిట్టయిన వేరే వాళ్ల సినిమాల గురించి కానీ మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడరు. కానీ మహేష్ బాబు అందరిలా కాదు. చాలా ఓపెన్ గా ఉంటాడు. అందుకే తాను ‘ఆగడు’ సినిమా చేయడం ఎంత పెద్ద తప్పో ఒప్పుకున్నాడు. ‘బాహుబలి’ సినిమా గొప్పదనం గురించి మాట్లాడాడు. ఈ రెండు సినిమాల గురించి మహేష్ చెప్పిన ఆసక్తికర సంగతులు చదవండి.

‘‘శ్రీమంతుడు ముందు నా రెండు సినిమాలు చేదు ఫలితాన్ని చూశాయి. ఐతే 1 నేనొక్కడినే సినిమా ఓ ప్రయోగం. దాన్ని క్రిటిక్స్ ఇష్టపడ్డారు. ఆ సినిమాకు సరిగా ఎడిట్ చేయకుండా హడావుడిగా విడుదల చేయడం వల్లే అలాంటి ఫలితం వచ్చిందని భావిస్తున్నా. కానీ ఆగడు సినిమా చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పిదం. నా కెరీర్ లో తొలిసారి నా నటన గురించి కూడా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నా. ఆ సినిమా నన్ను చాలా చాలా నిరాశ పరిచింది. రెండు నెలలు విరామం తీసుకున్నా. శ్రీమంతుడు ఓకే చేసినా.. ఆ స్క్రిప్టు మీద ఎంతో నమ్మకమున్నా కూడా షూటింగ్ కు వెళ్లడానికి టైం తీసుకున్నా. నేనా సమయంలో షూటింగుకి రెడీగా లేననిపించింది. ఐతే తప్పులు చేసినపుడు పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం. ఆగడు నాకలాంటి పాఠమే నేర్పింది’’ అని ఆగడు సినిమా పెట్టిన బాధ గురించి వివరించాడు మహేష్.

బాహుబలి గురించి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి సినిమా నన్ను చాలా టెన్షన్ పెట్టింది. అలాంటి అద్భుతమైన సినిమా చూశాక.. ప్రేక్షకులు వెంటనే ఇంకో సినిమా చూడ్డానికి రెడీగా ఉండరు. ఇంతకుముందు మగధీర సమయంలో నాకు బాగా గుర్తుంది. రెండు మూడు నెలలు ఇంకే సినిమా ఆడలేదు. పైగా బాహుబలికి వచ్చిన రెస్పాన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. దీంతో శ్రీమంతుడు ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను. పైగా నా గత రెండు సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో నా కెరీర్ లో ఏ సినిమాకు పడనంత టెన్షన్ ‘శ్రీమంతుడు’కే పడ్డాను. ముందు రోజైతే హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నంత టెన్షన్ లో ఉన్నా. నా చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది’’ అన్నాడు మహేష్.