Begin typing your search above and press return to search.

పూరీ ఒక ఫైటర్: వంశీ పైడిపల్లి

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 PM GMT
పూరీ ఒక ఫైటర్: వంశీ పైడిపల్లి
X
టాలీవుడ్ దర్శకులందరూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు నిర్మాతల అవతారమెత్తుతున్నారు. ఇన్నాళ్లూ సినిమా తీయడం మీద ఫోకస్ పెట్టిన డైరెక్టర్స్.. ప్రొడక్షన్ వైపు కూడా దృష్టి మళ్లిస్తున్నారు. కొందరు సొంత బ్యానర్ పెట్టుకొని సినిమాల నిర్మాణంలో భాగస్వాములుగా చేరుతుంటే.. మరికొందరు మాత్రం బయటి బ్యానర్లలో పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - శేఖర్ కమ్ముల - సుకుమార్ - అనిల్ రావిపూడి - క్రిష్ - మారుతి - నాగ్ అశ్విన్ - సురేందర్ రెడ్డి - హరీష్ శంకర్.. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో హవా చూపిస్తున్న చాలా మంది దర్శకులు ప్రొడ్యూసర్స్ గా మరోవైపు సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా చేరిపోయారు.

2007 లో 'మున్నా' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ పైడిపల్లి.. ఇన్నేళ్లలో కేవలం ఐదు చిత్రాలను మాత్రమే రూపొందించారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్తున్నారు. 'బృందావనం' 'ఎవడు' 'ఊపిరి' మహర్షి' వంటి విజయాలు వంశీ ఖాతాలో ఉన్నాయి.

ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ పాన్ ఇండియా మూవీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఇప్పుడు వంశీ నిర్మాతగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ''JGM'' (జనగణమన) చిత్రానికి వంశీ పైడిపల్లి ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పూరి కనెక్ట్ - శ్రీకర స్డూడియో బ్యానర్లపై రూపొందే ఈ సినిమాని ఛార్మి కౌర్ తో కలిసి నిర్మించనున్నారు వంశీ.

'లైగర్' సినిమా తర్వాత VD - పూరీ కాంబోలో రానున్న ''JGM'' చిత్రాన్ని మంగళవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాతల్లో ఒకరైన వంశీ పైడిపల్లి మాట్లాడారు. ఇది ప్రతి ఒక్కరినీ తట్టిలేపే కథ అని చెప్పారు. పూరీ సార్ కి నేను ఎలాంటి ఇన్ ఫుట్స్ ఇవ్వలేదని చెప్తుండగా.. పక్కనే ఉన్న పూరీ కల్పించుకొని వంశీ కూడా కొన్ని ఇన్ పుట్స్ అందించారని తెలిపారు.

''పూరీ జగన్నాథ్ ని ఒక్క పదంతో వర్ణించాలంటే అతనొక 'ఫైటర్' అని నేను చెప్తాను. క్రియేటర్ గానే కాకుండా ఒక మనిషిగా కూడా గొప్ప వ్యక్తి ఆయన. నా మొదటి సినిమాని మై హోమ్ గ్రూప్ వారి శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లో పూరీతో కలిసి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి రాకముందు నుంచే తెలుసు. నాకు బ్రదర్ లాంటి వాడు. అప్పట్లో చార్మీ హీరోయిన్ గా నటించిన ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాను'' అని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.

'JGM' వంటి ప్రతిష్టాత్మక సినిమాలో భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతీ భారతీయుడిని తట్టి లేపే సినిమా. కచ్చితంగా తెలియజెప్పాల్సిన కథ అని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. మరి ఈ సినిమా నిర్మాతగా దర్శకుడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

కాగా, 'జనగణమన' అనేది యుద్ధం నేపథ్యంలో దేశ భక్తిని చాటిచెప్పే ఫిక్షనల్ సినిమా. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 2023 ఆగస్టు 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు - సాంకేతిక నిపుణులు వంటి మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.