Begin typing your search above and press return to search.

రమేశ్ బాబు విషయంలో మహేశ్ అసంతృప్తి అదే!

By:  Tupaki Desk   |   9 Jan 2022 8:50 AM GMT
రమేశ్ బాబు విషయంలో మహేశ్ అసంతృప్తి అదే!
X
కృష్ణ తనయుడు రమేశ్ బాబు హీరోగా చాలాకాలం క్రితమే తెరపై సందడి చేశాడనే విషయం, ఈ కాలం కుర్రకారుకి అంతగా తెలియదు. కృష్ణ కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకునే 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో రమేశ్ బాబు నటించారు. చిన్నప్పటి అల్లూరిగా ఆయన ఆ సినిమాలో కనిపిస్తారు. ఆ తరువాత కృష్ణ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, 'సామ్రాట్' సినిమాతో హీరో అయ్యారు. 'చిన్నికృష్ణుడు' సినిమా చూసినవాళ్లంతా కూడా కృష్ణగారి కలర్ .. అంతే హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్పుకున్నారు. హీరోగా రాణించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనుకున్నారు.

'బజార్ రౌడీ' సినిమాతో మాస్ ఆడియన్స్ ను .. 'బ్లాక్ టైగర్' సినిమాతో యాక్షన్ హీరోగా ఆకట్టుకోవడానికి రమేశ్ బాబు తనవంతు ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా ఆడలేదు. ఆ తరువాత సినిమాలు కూడా ఆయనను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక ఆ తరువాత మహేశ్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లోగానే ఆయన అటు కృష్ణతోను .. ఇటు రమేశ్ బాబుతోను కలిసి నటించాడు. మొదటి నుంచి కూడా రమేశ్ బాబు - మహేశ్ బాబు మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉండేదట. చివరివరకూ అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.

మహేశ్ బాబుకి మంచి స్టార్ డమ్ వచ్చిన తరువాత రమేశ్ బాబు నిర్మాతగా మారారు. మహేశ్ తో 'అర్జున్' సినిమాను నిర్మించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఇది చాలా మంచి కథ. టీవీల్లో ఇప్పటికీ మంచి రేటింగ్ తెచ్చుకునే సినిమా ఇది. అయితే ఎందుకనో ఈ సినిమా థియేటర్ల దగ్గర హిట్ అనిపించుకోలేకపోయింది .. రమేశ్ బాబుకి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన మహేశ్ బాబుతో 'అతిథి' సినిమాను నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా కూడా నష్టాలనే మిగిల్చింది. ఆ తరువాత ఆయన 'దూకుడు' .. 'ఆగడు' సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

'ఆగడు' తరువాత నుంచి రమేశ్ బాబు సినిమాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఎప్పటిలానే ఆయనకి ధైర్యం చెప్పి ఆయనను తన సినిమాల నిర్మాణంలో భాగస్వామిని చేయడానికి మహేశ్ ఎంతో ప్రయత్నం చేశాడట. కానీ ఇక రమేశ్ బాబు అంతగా ఆసక్తిని చూపలేదు. తన అన్నయ్యను ఒక పెద్ద నిర్మాతగా చూడాలనేది మహేశ్ బాబు కోరిక అట. చివరికి ఆ ముచ్చట తీర్చకుండానే రమేశ్ బాబు నిన్న రాత్రి ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇది మహేశ్ బాబు తట్టుకోలేని విషయమని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. సినిమాలు చేయడం .. చేయకపోవడం అలా ఉంచితే, ఎప్పుడూ కూడా రమేశ్ బాబు మీడియా ముందుకు రాకపోవడానికి కారణమేమిటనేదే ఎవరికీ అర్థం కావడం లేదు.