Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాపై రూమర్లకు చెక్

By:  Tupaki Desk   |   10 March 2018 8:20 AM GMT
మహేష్ సినిమాపై రూమర్లకు చెక్
X
‘భరత్ అనే నేను’ తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ సినిమా గురించి ఈ మధ్య ఆసక్తికర రూమర్లు హల్ చల్ చేశాయి. న్యూజిలాండ్లో ప్రసారమయ్యే ఓ క్రైమ్ టీవీ సిరీస్ స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నారని.. ఒరిజినల్ రైటర్ కు క్రెడిట్ కూడా ఇస్తూ అధికారికంగా హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారని గట్టిగా ప్రచారం జరిగింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్లుగా.. ఇందులో వాస్తవం ఉండి ఉంటుందనే అంతా అనుకున్నారు. ఐతే ఈ విషయంలో చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి క్లారిటీ ఇచ్చేశాడు.

తమ సినిమా గురించి జరుగుతున్న ప్రచారమంతాఅబద్ధమని అన్నాడు. ట్విటర్లో ఒక వ్యక్తి ఈ సినిమాకు న్యూజిలాండ్ క్రైమ్ సిరీస్ స్ఫూర్తి కదా అని వంశీని ట్యాగ్ చేసి అడిగాడు. దీనికి వంశీ బదులిస్తూ.. తమ సినిమాకు ఏ క్రైమ్ సిరీస్ కానీ.. ఇంకే సినిమా కానీ స్ఫూర్తి కాదని తేల్చి చెప్పాడు. తన సొంత కథతోనే ఈ సినిమా తెరకెక్కబోతోందని వంశీ చెప్పకనే చెప్పాడు. సొంత కథ కానపుడు దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాపై పని చేయాల్సిన అవసరం వంశీకి ఉండదనే చెప్పాలి. తన డబ్బులతో.. తన కాంపౌండ్లో ఈ స్క్రిప్టు తయారైందని.. వేరే నిర్మాతలతో ఈ సినిమా చేయడం ఏం న్యాయమని అడుగుతూ పొట్లూరి వరప్రసాద్ వంశీ పైడిపల్లిపై కోర్టుకు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే.