Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ డైరెక్టర్.. 7 కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:30 PM GMT
సూపర్ హిట్ డైరెక్టర్.. 7 కోట్ల నష్టం
X
‘ఆనందో బ్రహ్మ’ సినిమాను జస్ట్ సూపర్ హిట్ అనో.. బ్లాక్ బస్టర్ అనో అనడానికి వీల్లేదు. ఈ సినిమా బడ్జెట్ రూ.3 కోట్లయితే.. వరల్డ్ వైడ్ షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చింది. శాటిలైట్ హక్కులు.. రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే.. ఈ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం ఆర్జించినట్లన్నమాట. ఈ చిన్న సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కర్త దర్శకుడు మహి.వి.రాఘవ. ఇటు నిర్మాతకు.. అటు బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాడు మహి. ఐతే ఈ సినిమాకు గాను అతను ఎంత పారితోషకం పుచ్చుకున్నాడో.. లాభాల్లో ఎంత వాటా అందిందో ఏమో గానీ.. ఈ సినిమాకు ముందు మాత్రం ఇండస్ట్రీలో చాలానే నష్టపోయాడట మహి. ఆ మొత్తం రూ.7 కోట్లని అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఎంబీఏ చేసి కొన్నేళ్లు ఉద్యోగం చేయడంతో పాటు బిజినెస్ కూడా చేసిన మహి.. బాగానే సంపాదించాడట. ఐతే సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ముందు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడట. ‘విలేజ్ లో వినాయకుడు’.. ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలను అతను నిర్మించాడు. అవి రెండూ డబ్బులు వెనక్కి తేలేదు. ఆ తర్వాత మహి.. స్వీయ దర్శకత్వంలో ‘పాఠశాల’ అనే సినిమాను నిర్మించాడు. శేఖర్ కమ్ముల లాగా.. తేజ లాగా అందరూ కొత్తవాళ్లతో అద్భుతం చేద్దామని అనుకున్నాడట మహి. ఐతే ఇది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ.. దీనికీ డబ్బులు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇక నిర్మాత అవతారం చాలించేసి.. దర్శకుడిగా ‘ఆనందో బ్రహ్మ’ సినిమా తీశాడు. ఈసారి మాత్రం అద్భుతమైన ఫలితం వచ్చింది.