Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మెయిల్

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:34 AM GMT
మూవీ రివ్యూ : మెయిల్
X
చిత్రం : మెయిల్

నటీనటులు: ప్రియదర్శి-హర్షిత్ రెడ్డి-గౌరి ప్రియ-రవీందర్ బొమ్మికంటి-మణి ఏగుర్ల-అనూష మేత తదితరులు
నేపథ్య సంగీతం: కమ్రాన్
సంగీతం: స్వీకార్ అగస్తి
ఛాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల-శ్యామ్ దూపాటి
నిర్మాత: ప్రియాంక దత్
రచన-దర్శకత్వం: ఉదయ్ గుర్రాల

సంక్రాంతి వేళ థియేటర్లలో పెద్ద సినిమాలే కాదు.. ఓటీటీలో ఓ చిన్న సినిమా కూడా ప్రేక్షకులను పలకరించింది. అదే.. మెయిల్. ‘ఆహా’ ద్వారా విడుదలైన ఈ చిన్న సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అది ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం మొదలవుతున్న సమయం. పల్లెటూరి జనాలకు కంప్యూటర్ గురించి పెద్దగా తెలియని సమయంలో తెలంగాణలోని కంబాలపల్లి అనే ఓ పల్లెటూరిలో రవికుమార్ (హర్షిత్ మల్గిరెడ్డి) అనే కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. అతడికి కంప్యూటర్‌ ను చూస్తే ఓ అందమైన అమ్మాయిని చూసినంత సంబరం. తాను ఇష్టపడ్డ అమ్మాయిని మించి దాని పట్ల ప్రేమను పెంచుకుంటాడు. అలాంటి సమయంలో ఆ ఊరికే చెందిన హైబత్ (ప్రియదర్శి) ఊరికి కొత్తగా ఒక కంప్యూటర్ తీసుకొస్తాడు. రవి ఎలాగైనా హైబత్ దగ్గర కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నదే ‘మెయిల్’ కథ.

కథనం-విశ్లేషణ:

మనకు సినిమా అనగానే ఒక భారీతనం.. ఎదురే లేకుండా సాగిపోయే హీరో.. భారీ బలగం ఉన్న విలన్.. రాష్ట్రాలు, దేశాలు దాటి ఎక్కడకెక్కడో తిరిగే కథ. కళ్లు చెదిరే సెట్టింగ్స్.. వందల మంది డ్యాన్సర్ల నడుమ సాగే మాస్ పాటలు.. లేదంటే ఫారిన్ లొకేషన్లో డ్యూయెట్లు.. బ్రహ్మాండం బద్దలైపోయే ఫైట్లు.. అన్నట్లు తయారైపోయింది. చివరికి చిన్న స్థాయి హీరోలు.. కమెడియన్లు ప్రధాన పాత్రల్లో నటించే సినిమాల్లోనూ ఈ ‘కమర్షియల్’ ఫార్ములానే అనుసరిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ అప్పుడప్పుడూ మన చుట్టూ ఉన్న మనుషుల్నే పాత్రలుగా చూపిస్తూ.. మన జీవితాల్నే తెరపైకి తీసుకెళ్లే రియలిస్టిక్ టచ్ ఉన్న కొన్ని సినిమాలు వస్తుంటాయి. కేరాఫ్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహణ. ఇప్పుడు ఈ కోవలో వచ్చిన మరో పక్కా లోకల్.. ఒరిజినల్ సినిమా ‘మెయిల్’. పైన చెప్పుకున్న ‘మసాలాలు’ ఏమీ లేకుండా మన జీవితాల్లోని ఒక స్వీట్ మెమొరీని మళ్లీ మన ముందుకు తెచ్చి ఒక పులకింతకు గురి చేసే రియలిస్టిక్ మూవీ.. మెయిల్.

‘మెయిల్’లో ఎంత సింపుల్ గా వినోదం పండించారనడానికి ఉదాహరణగా ఓ సన్నివేశం చెప్పుకుందాం. పల్లెటూర్లోకి కంప్యూటర్ తీసుకొచ్చి ఇంటర్నెట్ సెంటర్ మొదలుపెట్టిన వ్యక్తి.. తన కంప్యూటర్ కు వైరస్ ఎక్కించాడని ఓ కుర్రాడిని కొడతాడు. దీని మీద ఊర్లో పంచాయితీ కూడా నడుస్తుంది. ఆ కుర్రాడు చెప్పులేసుకుని లోనికి రావడం వల్లే వైరస్ ఎక్కిందని అతను వాదిస్తాడు. తర్వాత ఓ పెద్ద మనిషిని తీసుకెళ్లి మరీ కంప్యూటర్లోకి వైరస్ ఎక్కింది చూడండి అంటూ స్క్రీన్ వైపు చూపిస్తాడు. అక్కడ ఖాళీగా ఉన్న మూడు డ్రైవ్స్ బ్లూ కలర్లో కనిపిస్తుంటే.. మెమొరీ ఫుల్ అయిన ఒక డ్రైవ్ మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. అది వైరస్సే అని ఫిక్సయిపోయి ఆ కుర్రాడు చెప్పులేసుకున్నందు వల్లే వైరస్ ఎక్కిందని పెద్ద మనిషి కూడా తీర్పిచ్చేస్తాడు. తర్వా త టౌన్ నుంచి ఒక టెక్నీషియన్ వచ్చి చాలా పెద్ద సమస్య అన్నట్లు బిల్డప్ ఇచ్చి సింపుల్ గా ఆ డ్రైవ్‌ లో కొన్ని ఫైల్స్ డెలీట్ చేసి 500 పట్టుకుపోతాడు.

ఇప్పుడు పల్లెటూర్ల నుంచే లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఎదిగిన నేపథ్యంలో.. అప్పట్లో జనాలు అంత అమాయకంగా ఉండేవారా అనిపించొచ్చు కానీ.. అప్పటి అనుభవాలపై అవగాహన ఉన్న వాళ్లు ఈ సన్నివేశంతో ఈజీగా కనెక్టవుతారు. ‘మెయిల్’లో ఈ సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అయిపోతారు. కేవలం ఈ వైరస్ సీన్ మాత్రమే కాదు.. ‘మెయిల్’లో కంప్యూటర్ తో ముడి పడ్డ ప్రతి అనుభవమూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మంచి అనుభూతులను కలిగిస్తుంది. తొలిసారి కంప్యూటర్ చూసినపుడు హీరోలో కలిగే ఉద్వేగం.. తర్వాత ఎలాగైనా కంప్యూటర్ నేర్చుకోవాలని అతను పడే తపన.. ఊర్లోకి కంప్యూటర్ సెంటర్ వచ్చాక అందులో చేరాలని అతను పడే తాపత్రయం.. ఆ అవకాశం దక్కాక మెయిల్ ఓపెన్ చేయడం.. పాస్ట్ వర్డ్ పెట్టుకోవడం.. తర్వాత తనకెవరైనా మెయిల్ ఇచ్చారేమో అని రోజూ ఎంతో ఎగ్జైట్మెంట్ తో తెరిచి చూడటం.. ఇలా ఒకప్పటి నేపథ్యంలో కంప్యూటర్ తో ప్రేమలో పడ్డ ఓ కుర్రాడి జీవితాన్ని ఎంతో సహజంగా.. స్వచ్ఛంగా.. ఆహ్లాదకరంగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఐతే కేవలం ఈ అనుభూతుల నేపథ్యంలోనేే సినిమా మొత్తాన్ని నడిపిస్తే సరిపోదు కదా. అందుకే మీరు కోట్లు గెలుచుకున్నారంటూ మెయిల్స్ పంపి.. ప్రాససింగ్ ఫీ అంటూ లక్షలు కొట్టేసే కాన్సెప్ట్ ను కథలోకి తీసుకొచ్చాడు దర్శకుడు. తనకు ఏదో ఒక మెయిల్ వస్తే బాగుండని చూస్తున్న హీరోకు ఏకంగా రెండు కోట్ల లాటరీ తగిలిందని మెయిల్ వస్తే ఎలా ఉంటుంది.. దాని ఉచ్చులో పడి అతను ఎలా సమస్యల్లో చిక్కుకున్నాడు.. తర్వాత దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే నేపథ్యంలోె ద్వితీయార్ధాన్ని నడిపించాడు. హీరో ప్రేమ కథ.. అవసరానికి డబ్బులిచ్చి హీరో కుటుంబాన్ని మోసం చేసే వడ్డీ వ్యాపారి వ్యవహారాల్ని కూడా ఈ కంప్యూటర్ కథతో చక్కగా ముడిపెట్టి వాటిని కూడా సమాంతరంగా చక్కగా నడిపిన వైనం మెప్పిస్తుంది. వినోదం కోసం ఎక్కడా అనవసర డ్రామా.. హంగామా లేకుండా ప్రతి సన్నివేశం కూడా కథతో ముడిపడే.. సహజంగా సాగిపోవడం ‘మెయిల్’ ప్రత్యేేకత. తమిళ, మలయాళ సినిమాల్లో మాదిరి ముగింపులో విషాదాన్ని నింపి గుండెలు బరువెక్కేలా చేస్తారేమో అన్న భయం కలుగుతుంది కానీ.. అలా ఏమీ లేకుండా ఒక చమక్కుతో సినిమాకు సరదాగానే ముగింపు పలికిన వైనం ఆకట్టుకుంటుంది.

తెలంగాణ పల్లెటూర్ల సొగసును.. అక్కడి మనుషుల్ని.. వాళ్ల భాష యాసల్ని అత్యంత సహజంగా... అందంగా.. వినోదాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన చిత్రాల్లో ‘మెయిల్’ ఒకటిగా నిలుస్తుంది. నరేషన్ మరీ నెమ్మదిగా ఉండటం.. మధ్యలో కథ కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోవడం ‘మెయిల్’లో చెప్పుకోదగ్గ బలహీనతలు. థియేటర్లలో అయితే ఈ బలహీనతలు పెద్దవిగా కనిపిస్తాయేమో కానీ.. ఓటీటీలో చూస్తున్నపుడు సర్దుకుపోవచ్చు. ‘మెయిల్’ టీజర్.. ట్రైలర్ చూసినపుడే ఇది ఏ తరహా సినిమా అన్నదానిపై ఒక అవగాహన వస్తుంది. అక్కడ కనెక్ట్ అయ్యారంటే నిస్సందేహంగా ‘మెయిల్’ చూడొచ్చు. ఆస్వాదించవచ్చు. మంచి అనుభూతుల్ని మిగుల్చుకోవచ్చు. ఓటీటీల్లో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

‘మెయిల్’కు నటీనటుల ప్రతిభ అది పెద్ద ప్లస్ అయింది. కొత్త కుర్రాడే అయినా హర్షిత్ మల్గిరెడ్డి రవికుమార్ పాత్రను పోషించిన విధానం అబ్బురపరుస్తుంది. కొత్తవాడే అయినా.. సహజమైన అతడి నటన.. హావభావాల కారణంగా కాసేపటికే అతడికి అలవాటు పడిపోతాం. మన పక్కింటి కుర్రాడిని చూస్తున్న భావనలోకి వెళ్లిపోతాం. ఎక్కడా కట్టు తప్పకుండా పాత్రకు తగ్గట్లు అతను నటించిన విధాంన ఆకట్టుకుంటుంది. అతడికి జోడీగా నటించిన గౌరి కూడా చాలా బాగా చేసింది. ఆమె లాంటి అమ్మాయిలు కూడా పల్లెటూళ్లలో చాలామంది కనిపిస్తారు. ఇక ప్రియదర్శి పాత్ర నిడివి తక్కువే కానీ.. అతను కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టాడు. ఆద్యంతం నవ్వించాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో ఫ్రెండు సుబ్బు పాత్రలో నటించిన మణి.. వడ్డీ వ్యాపారిగా చేసిన రవీందర్ బొమ్మికంటి కూడా తమదైన ముద్ర వేశారు. మిగతా నటీనటులు సైతం ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

‘మెయిల్’కు సాంకేతిక నిపుణులు కూడా మంచి సహకారమే అందించారు. కమ్రాన్ నేపథ్య సంగీతం ఆద్యంతం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ప్రేమ సన్నివేశాలను మించి హీరోకు.. కంప్యూటర్ కు మధ్య రొమాన్స్ పండించడానికి నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. స్వీకర్ అగస్తి చేసిన రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. శ్యామ్ దూపాటితో కలిసి ఛాయాగ్రహణ బాధ్యత తీసుకున్న దర్శకుడు ఉదయ్ గుర్రాల తన కథను విజువల్ గా ఎలా చెప్పాలనుకున్నాడో అలా చెప్పాడు. ఒక పల్లెటూరి లోకి వెళ్లి కెమెరా పెట్టి అక్కడి మనుషుల జీవితాల్ని చూస్తున్న భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు.. సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. ఇలాంటి కథను సినిమా తీయడానికి ఒప్పుకుని ప్రోత్సహించిన ‘స్వప్న సినిమా’కు అభినందనలు తెలపాలి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఉదయ్ గుర్రాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాకు మరో మంచి టెక్నషియన్ దొరికానడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా తెలంగాణ రూరల్ సినిమా అంటే కష్టాలు కన్నీళ్లే అన్నట్లుగా సాగిపోయాయి కానీ.. అక్కడ ఎంత వినోదం ఉందో ‘మెయిల్’తో ఉదయ్ చూపించాడు. కథల కోసం ఎక్కడో వెతకక్కర్లేదని.. నేల విడిచి సాము చేయాల్సిన పని లేదని.. మన అనుభవాలనే ఆసక్తికర రీతిలో ప్రెజెంట్ చేస్తే సరిపోతుందని అతను చాటాడు. నరేషన్ మరీ నెమ్మది అనే కంప్లైంట్ మినహాయిస్తే దర్శకుడిగా ఉదయ్ పనితనానికి వంకలు పెట్టే అవసరమే లేదు.


చివరగా: మెయిల్.. తెరిచి చూడాల్సిందే

రేటింగ్- 2.75/5