Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' బాటలో 'మేజర్'.. టికెట్ రేట్లపై కీలక నిర్ణయం..!

By:  Tupaki Desk   |   27 May 2022 9:31 AM GMT
ఎఫ్ 3 బాటలో మేజర్.. టికెట్ రేట్లపై కీలక నిర్ణయం..!
X
కరోనా పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వాలు జీవోలు జారీచేసిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న కొన్ని సినిమాలు.. అధిక టికెట్ ధరలతో విడుదల కాబడ్డాయి. అయితే ఈ రేట్లు సామాన్యుల జేబులకు చిల్లులు పడే రేంజ్ లో ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఓటీటీలకు అలవాటు పడిపోయిన ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఇటీవల వచ్చిన పెద్ద సినిమాలకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇది గమనించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన 'ఎఫ్ 3' చిత్రాన్ని తక్కువ టికెట్ ధరలతో ఈరోజు శుక్రవారం రిలీజ్ చేశారు.

మల్టీప్లెక్స్ లలో 250 + జీఎస్టీ.. మిగతా థియేటర్లలో జీఎస్టీతో కలిపి 250 గా 'ఎఫ్ 3' టికెట్ ధరలు ఉన్నాయి. సింగల్ స్క్రీన్ లలో 150 + జీఎస్టీ మరియ రూరల్ ఏరియాల్లో జీఎస్టీతో కలిపి 150 రూపాయలుగా రేట్లు నిర్ణయించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి డెసిజన్ తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.

అయితే ఇప్పుడు 'ఎఫ్ 3' బాటలోనే ''మేజర్'' మూవీ నడవబోతోంది. జూన్ 3న విడుదల కాబోతోన్న ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ రేట్లు పెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. 'మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో' అంటూ 'ఎఫ్ 3' టీమ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే.. 'మేజర్' మేకర్స్ ఏకంగా టికెట్ ధరలను పోస్టర్లలో వెల్లడించారు. ఇవి 'ఎఫ్ 3' కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

''మేజర్'' సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లలో రూ.150 - మల్టీఫ్లెక్స్ లలో రూ.195 గా టికెట్ రేట్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లలో రూ.147 - మల్టీఫ్లెక్స్ లలో రూ.177 గా ధరలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో GST తో కలిపే ఈ రేట్లకు ఫిక్స్ చేయడం గమనార్హం.

ఈ విషయాన్ని హీరో అడివి శేష్ సోషల్ మీడియాలో వెళ్లడిస్తూ.. ''అత్యంత సరసమైన ధరలలో ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో 'మేజర్' కోసం అతి తక్కువ ధరలు నిర్ణయించాం. ఇవి పాండమిక్ తర్వాత ఏదైనా సినిమాలలో అత్యల్పం'' అని పేర్కొన్నారు.

కాగా, అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందింది. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ సినిమాని నిర్మించింది. తెలుగు మలయాళ హిందీ భాషల్లో జూన్ 3న ఈ బయోపిక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.