Begin typing your search above and press return to search.

అంచనాల్ని చేరకపోతే అంతే సంగతి

By:  Tupaki Desk   |   24 July 2015 1:46 PM GMT
అంచనాల్ని చేరకపోతే అంతే సంగతి
X
అఖిల్‌ అక్కినేని.. ప్రస్తుతం తెలుగు యువత స్మరిస్తున్న పేరు ఇది. టాలీవుడ్‌ లో మహేష్‌ తర్వాత అంతటి ఛరిష్మా ఉన్న హీరోగా చెప్పుకుంటున్నారు. ఆరంగేట్రమే దుమ్ము దులిపేస్తాడన్న అంచనాలేర్పడ్డాయి. అఖిల్‌ కి ఓవర్సీస్‌ లోనూ మహేష్‌ కి ధీటుగా మార్కెట్‌ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.

వి.వి.వినాయక్‌ లాంటి మాస్‌ డైరెక్టర్‌ చేతిలో పడ్డాడు. నితిన్‌ లాంటి ప్రొడ్యూసర్‌ తగిలాడు.. సయేషా అంతటి అందగత్తె అతడి సరసన నాయిక అయ్యింది. అతడు టాలీవుడ్‌ లో సంచలనాలు సృష్టించడమే తరువాయి.. అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతేనా ఎప్పటికప్పుడు ఈ సినిమాకి హైప్‌ పెంచేయడం చర్చల్లోకొచ్చింది. ఈ స్థాయిలో హైప్‌ పెంచేయడం ఓ డెబ్యూ హీరోకి కలిసొస్తుందా? దీనివల్ల లాభమా? నష్టమా అంటూ విశ్లేషకులు తమవైన విశ్లేషణలు చెబుతున్నారు.

ఒక ఆరంగేట్ర హీరోకి ఈ స్థాయిలో అంచనాలు పెరగడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ అని చెబుతున్నారు. పైగా మహేష్‌ అంతటివాడే ఓవర్‌నైట్‌ సూపర్‌ స్టార్‌ అయిపోలేదు. రాజకుమారుడు హిట్టయ్యాక అతడు సూపర్‌ స్టార్‌ అవ్వడానికి దాదాపు ఐదేళ్లు పైగానే పట్టింది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్సీస్‌ మార్కెట్లో మహేష్‌ కి ఉన్నంత క్రేజు వేరే ఏ హీరోకి రావడం కష్టం. చరణ్‌, బన్ని, పవన్‌ లాంటి హీరోలకే ఓవర్సీస్‌ లో ఆశించినంత గుర్తింపు లేదు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. అలాంటిది అఖిల్‌ కి ఓవర్సీస్‌ బిజినెస్‌ అదిరిపోయిందంటూ రిపోర్ట్‌ రావడం కూడా ఓ రకంగా హైప్‌ నిచ్చే ప్రయత్నమే. అందరూ చెప్పినట్టే అన్నీ కుదిరితే ఓకే లేకపోతేనే సమస్య.

అయితే ఇలా పెచ్చుమీరిన హైప్‌ పెంచేయడం వల్ల ఒకవేళ అభిమానులకు ఆశించినదేదో తెరపై కనిపించకపోతే మొదటికే మోసం వస్తుంది. అతడి నుంచి నటన, డ్యాన్సులు, ఫైట్స్‌ లో ఎక్కువ ఎక్స్‌ పెక్ట్‌ చేస్తారు. వాటిని రీచ్‌ కాకపోతే అంతే సంగతి. అఖిల్‌ డ్యాన్సులు ఇరగదీస్తున్నాడు, ఫైట్స్‌ చంపేశాడు వంటి వ్యాఖ్యానాలు అనవసర హైప్‌ ని పెంచేస్తాయి. అయితే వాటి కంటే తొలి సినిమా వరకూ అతడిపై ఒత్తిడి పెంచకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.