Begin typing your search above and press return to search.

బోడి బాలరాజుగా అదరగొట్టిన చైతూ.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బాగానే కష్టపడ్డాడే!

By:  Tupaki Desk   |   30 July 2022 5:30 AM GMT
బోడి బాలరాజుగా అదరగొట్టిన చైతూ.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బాగానే కష్టపడ్డాడే!
X
టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హిందీలో ''లాల్ సింగ్ చడ్డా'' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీలో చైతూ కీలక పాత్ర పోషించారు. ఇది అతనికి బాలీవుడ్ డెబ్యూ. ఇందులో బాలరాజు బోడి అనే పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. శుక్రవారం చై పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని వదిలారు.

ఈ సందర్భంగా నాగచైతన్య ట్వీట్ చేస్తూ.. ''బాలరాజు జర్నీ నాకు ఎప్పుడూ సూపర్‌ స్పెషల్‌ గా మిగిలిపోతుంది. అలా నన్ను ముందుకు తీసుకెళ్లినందుకు #లాల్ సింగ్ చడ్డా బృందానికి చాలా కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్'' అని పేర్కొన్నారు. బాలరాజు పాత్రకు సంబంధించిన లుక్ అండ్ గెటప్స్ విషయాలు - షూటింగ్ అనుభవం మరియు దాని కోసం అక్కినేని యువ హీరో ఎంతగా కష్టపడ్డాడు అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

నాగచైతన్య మాట్లాడుతూ.. ''స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల. అతను ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఓ యువకుడు. చాలా మంది పేర్లకు ముందు ఇంటి పేరుగా ఊరి పేర్లు ఉంటాయి. అలాగే బాలరాజుకు బోడిపాలెంలోని బోడి అనేదాన్ని పేరుకు తగిలించాం. అంతేకాకుండా బాలకృష్ణ - బలరాం.. ఇలా నాలుగైదు పేర్లను పరిశీలించాం. చివరకు ఆమీర్ సర్ తో సహా అందరికీ బాలరాజు బాగా నచ్చింది'' అని చెప్పారు.

''మా గ్రాండ్ ఫాదర్ 'బాలరాజు' అనే చిత్రంలో నటించడం.. ఆ పేరునే నా పాత్రకు పెట్టడం అనేది మ్యాజిక్‌ లా అనిపించింది. సినిమాలో నా లుక్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. షూటింగ్ జరిగినన్ని రోజులూ నన్ను నేను మర్చిపోయా. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. కొత్త ప్రపంచాన్ని చూశా. షూటింగ్ అయిపోయిందని చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. మామూలుగా ఒక సినిమా పూర్తైన వెంటనే అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతుంటా. కానీ ఈ సినిమా నుంచి బయటకు రావాలనిపించలేదు" అని చైతన్య చెప్పుకొచ్చాడు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ''చై తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రొడ్యూసర్ గా అతనితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అతను ఒక టీమ్ కోసం నిలబడే టీమ్ ప్లేయర్. ఒక యాక్టర్ గా చైతూ ప్రతీ షాట్ కోసం ఎంతో ఫోకస్ గా ఉంటాడు. నేను అతని తల్లిదండ్రులు నాగార్జున మరియు లక్ష్మీ గార్లకు ఫోన్ చేసి 'మీరు చైతూ ని చాలా బాగా పెంచారు. పేరెంట్స్ గా మీరు చాలా గర్వపడాలి' అని చెప్పాను. అతను అద్భుతమైన వ్యక్తి'' అని అన్నారు.

హిందీ వచ్చిన నటులు కూడా కొన్ని సార్లు ఇబ్బంది పడుతారని.. కానీ చైతన్య మాత్రం అసలు ఎలాంటి ఇబ్బంది పడకుండా హిందీ డైలాగ్స్ చెప్పేశారని.. అతనితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించినని దర్శకుడు అద్వైత్ చందన్ కొనియాడారు. అంతేకాదు చై చాలా కామ్ అండ్ కూల్ గా ఉంటాడని మేకప్ డిజైనర్ - కాస్ట్యూమ్ డిజైనర్ తదితరులు కొనియాడారు.

ఇకపోతే నాగచైతన్య ఈ సినిమాలో విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారని వీడియో చూస్తే అర్థం అవుతుంది. బాల పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు హెయిర్ స్టైల్ మరియు మీసకట్టును రిఫరెన్స్‌ గా తీసుకున్నారు. పళ్లు కాస్త ఎత్తుగా కనిపించేందుకు క్లిప్ పెట్టారు. చైతన్య తల్లి లక్ష్మీ కూడా సెట్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 'నేను తాతయ్య పాత్రలో కనిపిస్తాను' అని చై చెప్పగా.. 'నేను ఒరిజినల్ గా ఇలాంటిది చూడలేదే' అని ఆమె అంటుంది. 'ఇది ఒరిజినల్ లో లేదు' అని చైతూ నవ్వేశారు.

కాగా, హాలీవుడ్ లో విజయవంతమైన 'పారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్ గా ''లాల్ సింగ్ చెడ్డా'' మూవీ తెరకెక్కింది. అమీర్‌ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌ - వయ్ కామ్18 స్టూడీయోస్ బ్యాన‌ర్‌ ల‌పై ఆమిర్‌ ఖాన్‌ - కిర‌ణ్‌ రావు - జ్యోతి దేశ్‌ పాండే - అజిత్ అందారే సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.