Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్ - సూర్య ప్ర‌శంసించిన ట్రైల‌ర్ ఇది

By:  Tupaki Desk   |   17 July 2022 1:34 PM GMT
క‌మ‌ల్ హాస‌న్ - సూర్య ప్ర‌శంసించిన ట్రైల‌ర్ ఇది
X
`పుష్ప` చిత్రంలో క‌ఠినాత్ముడైన‌ బ్యాడ్ పోలీస్ గా న‌టించి తెలుగు వారిని మెప్పించాడు ఫ‌హ‌ద్ ఫాజిల్. మ‌ల‌యాళంలో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించి విజ‌యాలు అందుకునే అత‌డి టాలీవుడ్ ఆరంగేట్రం ఘ‌నంగా చాటుకున్నాడు. పుష్ప‌రాజ్ కి ధీటైన ప్ర‌త్య‌ర్థిగా తెర‌పై క‌నిపించాడు. ఫ‌హ‌ద్ లోని విల‌క్ష‌ణ‌త స్క్రిప్టు సెలెక్ష‌న్ అత‌డిని మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో సూప‌ర్ స్టార్ గా ఆవిష్క‌రించాయి అంటే అతిశ‌యోక్తి కాదు. అత‌డి నుంచి ఇప్పుడు మ‌ల‌యాళంలో మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమా వ‌స్తోంది. `మ‌ల‌య‌న్ కుంజు` అనేది టైటిల్. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లై అభిమానుల‌తో పాటు సూప‌ర్ స్టార్ల నుంచి కాంప్లిమెంట్లు అందుకుంది.

స్టార్ హీరోలు క‌మ‌ల్ హాస‌న్ - సూర్య ఈ మూవీ ట్రైల‌ర్ ని వీక్షించి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ట్రైల‌ర్ ఆద్యంతం భావోద్వేగ న‌ట‌న‌తో ఫ‌హ‌ద్ అల‌రించాడు. ట్రైల‌ర్ లో పసిపాప ఏడుపు అనికుట్ట‌న్ (ఫ‌హ‌ద్)ని చాలా డిస్ట్ర‌బ్ చేస్తుంది. అలాగే అత‌డి గెలుపోట‌ముల గురించిన ప్ర‌స్థావ‌న ఈ ట్రైల‌ర్ లో ఉంది. ``అనికుట్టన్ మళ్లీ ఓడిపోయాడు`` అని ఇంద్రన్స్ చెప్పడంతో వీడియో మొదలవుతుంది. చివరికి నిజంగా స‌ర్వ‌స్వం కోల్పోయిన అనికుట్టన్ ఒక బురద గొయ్యి నుండి తనను తాను బయ‌ట‌ప‌డేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలతో వాతావ‌ర‌ణం ఉద్వేగ‌పూరితంగా మారుతుంది. ఓవ‌రాల్ గా ట్రైల‌ర్ ఆద్యంతం ఒక కొత్త‌ద‌నం నిండిన యాంబియెన్స్ తో అద్భుత‌ రీరికార్డింగ్ తో అల‌రించింది. ఫ‌హద్ మ‌రోసారి వైవిధ్య‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

ఈ చిత్రంలో రజిషా విజయన్- ఇంద్రన్స్- జాఫర్ ఇడుక్కి - దీపక్ పరంబోల్ త‌దిత‌రులు నటించారు. గతంలో మాలిక్ -సి యు సూన్ చిత్రాలకు సహాయకుడిగా ప‌ని చేసిన సాజిమోన్ ప్రభాకర్ దర్శకుడిగా ప‌రిచ‌య చిత్ర‌మిది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళ పరిశ్రమలో మోహన్ లాల్ 1992 చిత్రం యోధకు పనిచేసిన రెహ‌మాన్ చాలా కాలానికి ఒక స్ట్రెయిట్ మ‌ల‌యాళ చిత్రానికి ప‌ని చేసారు.

ఫహద్ ఫాసిల్ నటించిన మాలిక్ - సి యు సూన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేష్ నారాయణన్ స్క్రీన్ ప్లే ని అందించ‌డ‌మే గాక‌ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేసారు. ఇటీవలి చిత్రాలైన ఆర్క్కారియమ్ -నాయట్టుకు నారాయ‌ణ‌న్ ఎడిటర్ గా ప‌ని చేసారు. అతని 2017 చిత్రం `టేక్ ఆఫ్` అనేక ప్రశంసలను గెలుచుకుంది - ఉత్తమ తొలి చిత్ర‌ దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును.. IFFI 2017లో సిల్వర్ పీకాక్ అవార్డు ను అలాగే 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక ప్రస్తావన అవార్డును టేక్ ఆఫ్ అందుకుంది. మలయంకుంజును అర్జు బెన్ ఎడిటింగ్ చేసారు. ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సెంచరీ సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు ప్ర‌భాక‌ర్ తో క‌లిసి ఫహద్ ఫాసిల్ తండ్రి ఫాజిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 22న ఈ చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.

`మలయంకుంజు` ట్రైలర్ పై హీరో సూర్య ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్య ట్విటర్ లో ప్ర‌స్థావిస్తూ... ``ఫాసిల్ కు ప్రేమ - గౌరవం! ఫహద్ మీ కథలతో నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తారు..! నిజంగా భిన్నమైన ఈ ప్రయత్నానికి సంబంధించిన ఫుటేజీ చూసి ఆశ్చర్యపోయాను..!`` అని ట్వీట్ చేసారు. ఇది ఫ‌హ‌ద్ నుంచి మ‌రో విల‌క్ష‌ణ చిత్రం అని క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఫ‌హ‌ద్ ఇటీవ‌లే ఘ‌న‌విజ‌యం సాధించిన విక్ర‌మ్ చిత్రంలో క‌మ‌ల్ తో పాటు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.