Begin typing your search above and press return to search.

22 ఏళ్ళ తర్వాత వైఎస్ ఆర్ కోసం

By:  Tupaki Desk   |   9 April 2018 10:46 AM GMT
22 ఏళ్ళ తర్వాత వైఎస్ ఆర్ కోసం
X
ఆనందో బ్రహ్మ ఫేం మహి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే సంచలనాలకు వేదికగా మారుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా కాబట్టి ఆయన పధకాల ద్వారా లబ్ది పొందిన ప్రజానీకం దీని పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హీరోగా ఎవరు నటిస్తారు అనే చర్చ చాలా కాలమే సాగినప్పటికీ చివరికి మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి దగ్గర ఛాయస్ ఆగిపోవడంతో ఇప్పుడు రూట్ మొత్తం క్లియర్ అయ్యింది. మమ్ముట్టి వైఎస్ ఆర్ గా మెప్పించగలడా అనే అనుమానాలకు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెక్ పెట్టేసారు. పెద్దాయన ఆహార్యాన్ని అచ్చు గుద్దినట్టు మమ్ముట్టి ఓడిసిపట్టుకున్న తీరు చూసి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టే ఉందని ఫాన్స్ అభిప్రాయపడ్డారు.

ఇక మమ్ముట్టి వరకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఇప్పటి దాకా ఈ కేరళ సూపర్ స్టార్ తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. ఒకటి 1992లో కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం. రెండోది 1996లో ఉమామహేశ్వరరావు డైరెక్షన్ లో సుమన్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ సూర్య పుత్రులు. ఇవి కాకుండా మముట్టి మనకు డబ్బింగ్ సినిమాల ద్వారానే పరిచయం. 90 దశకంలో వచ్చిన సామ్రాజ్యం అప్పట్లో తెలుగు సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టగా రజనీకాంత్ తో కలిసి నటించిన డబ్బింగ్ సినిమా దళపతి మనవాళ్ళకు మరింత చేరువ చేసింది. ఆ తర్వాత పదేళ్ళ పాటు మమ్ముట్టి డబ్బింగ్ సినిమాల హవా జోరుగా సాగింది.

మళ్ళి ఇన్నాళ్ళకు జననేత బయోపిక్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల మమ్ముట్టి కూడా ఉత్సాహంగా ఉన్నాడు. సుమారు ఎనిమిది గంటల పాటు మహి రాఘవ నెరేషన్ విన్న మమ్ముట్టి ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు టాక్. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పాద యాత్ర మొదలు పెట్టిన ఈ రోజే షూటింగ్ కూడా ప్రారంభించడం కాకతాళీయమైనా ఫాన్స్ మాత్రం శుభ శకునంగా భావిస్తున్నారు.