Begin typing your search above and press return to search.

వెండితెర వైఎస్.. డబ్బింగ్ మొదలెట్టేశాడు

By:  Tupaki Desk   |   10 July 2018 7:00 AM GMT
వెండితెర వైఎస్.. డబ్బింగ్ మొదలెట్టేశాడు
X
ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ పాత్రను పోషిస్తున్నారు. మొన్న వైఎస్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. అభినయం అందరినీ ఆకట్టుకున్నాయి. వైఎస్ పాత్రలో చాలా సులువుగా ఒదిగిపోయారాయన. మలయాళీ అయి ఉండి చక్కగా తెలుగులో డైలాగులు చెప్పడం ద్వారా ఆశ్చర్యపరిచారాయన. కేవలం టీజర్ వరకే ఆయన వాయిస్ వినిపిస్తుందా.. సినిమా అంతటా ఆయనే వైఎస్ పాత్రకు డబ్బింగ్ చెబుతారా అనే విషయంలో కొంత సందేహాలున్నాయి.

ఆ సందేహాలకు తెరదించుతూ ఈ రోజు ఒక అప్ డేట్ ఇచ్చింది ‘యాత్ర’ టీం. ఈ సినిమాలో వైఎస్ పాత్రకు మమ్ముట్టినే వాయిస్ ఇస్తున్నారు. ఆయన ఇప్పటికే డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. డబ్బింగ్ స్టూడియో నుంచి మమ్ముట్టితో పాటు చిత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్.. నిర్మాతలు కలిసి ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యాత్ర’ షూటింగ్ మొదలై రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డబ్బింగ్ పని మొదలుపెట్టేయడం విశేషమే. వైఎస్ ఎలా అయితే నిర్విరామంగా పాదయాత్రలో పాల్గొన్నాడో.. అదే తరహాలో విరామం లేకుండా ఈ సినిమా చిత్రీకరణను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. సెప్టెంబరులోపే సినిమా పూర్తవుతుందట. తర్వాత కొంచెం నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసి మంచి టైమింగ్ చూసి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.