Begin typing your search above and press return to search.

సినిమా కోసం వేసిన చావు పోస్ట‌ర్ నిజ‌మైంది!

By:  Tupaki Desk   |   15 July 2019 7:53 AM GMT
సినిమా కోసం వేసిన చావు పోస్ట‌ర్ నిజ‌మైంది!
X
రీల్ కోసం వేసిన చావు పోస్ట‌ర్ రియ‌ల్ గా జ‌రిగిన విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. విచిత్రంగా ఉండే ఈ ఉదంతంలోకి వెళితే.. త‌మిళ‌నాడులోని తూత్తుకూడి జిల్లా కాయ‌ల్ ప‌ట్టినం ఊరికి చెందిన 52 ఏళ్ల గోపాల్ వంటప‌నితో పాటు వంట సామాగ్రిని అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. తన వ్యాపారం మ‌రింత వృద్ధి చెందేందుకు వీలుగా ఆయ‌నో పోస్ట‌ర్ వేయించారు. గ‌రిట నుంచి గ‌జ‌రాజు దాకా ఏదైనా స‌ప్లై చేస్తానంటూ సాగించిన అత‌గాడి పోస్ట‌ర్ హిట్ కావ‌ట‌మే కాదు.. అత‌నికి సినిమా అవ‌కాశాల్ని తెచ్చి పెట్టింది.

డిఫ‌రెంట్ గా సాగించిన ప్ర‌చారంలో అత‌ని ఫోటో చూసి మ‌రీ వెతుక్కుంటూ వ‌చ్చి సినిమాలో వేషం ఇచ్చారు. ఈ సినిమాలో అత‌డిది విల‌న్ పాత్ర‌. సినిమాలో ఆ పాత్ర చ‌నిపోవ‌టం.. క‌న్నీటి నివాళి అంటూ అంటించిన పోస్ట‌ర్లను స్నేహితుల‌కు.. బంధువుల‌కు వాట్సాప్ చేశారు. దీంతో.. ఆయ‌న నిజంగానే చ‌నిపోయాడ‌నుకొని ప‌లువురు పూల‌మాల‌లు తీసుకొని ఆయ‌న ఇంటికి వ‌చ్చారు.

నిక్షేపంగా ఇంట్లో ఉన్న ఆయ‌న‌.. న‌వ్వుతూ తాను చేసిన ప‌నిని చెప్పారు. ఆ వెంట‌నే తాను చ‌నిపోయిన‌ట్లు ఉండే పోస్ట‌ర్ల‌ను చింపివేస్తూ ఫోటోలు దిగి.. వాటిని షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఊరు నిండా ఆయ‌న చ‌నిపోయిన పోస్ట‌ర్లు వెలిశాయి. ఇది సినిమాలో ప్ర‌చారంలో భాగ‌మ‌ని భావించారు ప‌లువురు.

కొంద‌రికి అనుమానం వ‌చ్చి ఆరా తీయ‌గా.. ఆయ‌న అనారోగ్యంతో హ‌టాత్తుగా మ‌ర‌ణించిన‌ట్లుగా కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించ‌టంతో షాక్ తింటున్నారు. రీల్ లో చ‌నిపోవ‌టం కామ‌నే అయినా.. రీల్ పాత్ర‌కు త‌గ్గట్లే రియ‌ల్ గా కూడా చ‌నిపోయిన వైనం ఇప్పుడు అంద‌రిని షాక్ కు గురి చేస్తోంది. త‌న చావు పోస్ట‌ర్ల‌ను తానే ప్ర‌చారం చేసుకున్న వారానికే నిజంగా చ‌నిపోయిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.