Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘మనసుకు నచ్చింది’

By:  Tupaki Desk   |   16 Feb 2018 1:43 PM GMT
మూవీ రివ్యూ : ‘మనసుకు నచ్చింది’
X
చిత్రం : ‘మనసుకు నచ్చింది’

నటీనటులు: సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ - అదిత్ అరుణ్ - త్రిధా చౌదరి - నాజర్ - ప్రియదర్శి- పునర్ణవి భూపాలం - సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: రవి యాదవ్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: సంజయ్ స్వరూప్ - జెమిని కిరణ్
రచన -ద ర్శకత్వం: మంజుల ఘట్టమనేని

హీరోయిన్ కావాలనుకుని అనివార్య కారణాల వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయిన కృష్ణ కూతురు మంజుల ఉన్నట్లుండి దర్శకురాలిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

కథ:

సూరజ్ (సందీప్ కిషన్).. నిత్య (అమైరా దస్తూర్) బావా మరదళ్లు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఐతే వాళ్ల మనసేంటో తెలుసుకోకుండా పెద్దవాళ్లు పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఐతే వాళ్లిద్దరూ ఆ పెళ్లిని కాదనుకుని తమకు ఇష్టం వచ్చినట్లు బతకడానికి కలిసి గోవా పారిపోతారు. అక్కడ వాళ్ల జీవితాల్లోకి కొత్త వ్యక్తులు వస్తారు. అలాగే తమ అభిరుచుల మేరకు లైఫ్ లీడ్ చేసే పనిలోనూ పడతారిద్దరూ. మరి వీళ్ల ప్రయాణం ఎక్కడిదాకా సాగిందన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘మనసుకు నచ్చింది సినిమాలో ఒక చోట హీరో తనకు తానుగా ‘ది బెస్ట్’ అని కితాబిచ్చుకుంటాడు. హీరోయిన్ మధ్యలో అడ్డు తగిలి.. ‘‘ఈ మాట వేరే వాళ్లు చెప్పాలి నువ్వు కాదు’’ అంటుంది. ఈ డైలాగ్ విన్నాక ‘మనసుకు నచ్చింది’ గురించి మంజుల చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తాను తీసిన సినిమా అద్భుతమని.. ఇది నచ్చనివాళ్లంటూ ఉండరని.. మనసున్న ప్రతి వారికీ ఈ చిత్రం నచ్చేస్తుందని అనడమే కాదు.. ఈ సినిమా నచ్చని వాళ్ల గురించి ఒక కామెంట్ చేసిందామె. మరి సినిమా తీసిన వాళ్లు తమ ప్రాడక్ట్ ‘ది బెస్ట్’ అనుకుంటే సరిపోదు కదా.. ఆ మాట చెప్పాల్సింది జనాలు కదా? ఐతే ‘మనసుకు నచ్చింది’ మంజుల చెప్పిన స్థాయిలో కాదు కదా.. కనీసం ‘పర్వాలేదు’ అని కూడా అనిపించదు. రెండున్నర గంటల ఈ సినిమాలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే అంశాలు.. సన్నివేశాలు బోలెడు.

ఎవరైనా చక్కిలిగింతలు పెట్టేసి అవతలి వాళ్లను నవ్వించేశాం అనుకుంటే ఎలా ఉంటుంది..? ‘మనసుకు నచ్చింది’ సినిమాలో ఫీల్ కూడా అలాంటిదే. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లెజెంట్ గా అనిపిస్తుంటుంది. దృశ్యమూ మెరిసిపోతుంటుంది. ఇక నటీనటులైతే తెగ నటించేస్తుంటారు. ఓవర్ గా రియాక్టవుతూ హావభావాలు పలికించేస్తుంటారు. అందరూ కలిసి మనం ఒక అద్భుతమైన ఫీల్ ఉన్న సన్నివేశాలు చూస్తున్న భావనను బలవంతంగా కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాస్తవానికి సినిమాలో ఫీల్ అన్న మాటే ఉండదు. ప్రతి సన్నివేశంలోనూ నాటకీయతే కనిపిస్తుంది. ఆరంభం నుంచి చివరి దాకా సన్నివేశాలు.. మాటలు అన్నీ డ్రమటిగ్గా సాగిపోతూ ప్రేక్షకుడి అసహనాన్ని పెంచుతూ పోతాయి.

చిన్నప్పట్నుంచి స్నేహితులుగా పెరిగి పెద్దయిన వాళ్లు తమకు తెలియకుండానే ప్రేమలో పడిపోవడం అన్న కథాంశం దశాబ్దంన్నర కిందటే ‘నువ్వే కావాలి’.. ‘నువ్వు లేక నేను లేను’ లాంటి సినిమాల్లో చూశాం. మళ్లీ అదే పాయింటుతో ‘మనసుకు నచ్చింది’ తీసింది మంజుల. కాకపోతే ఇక్కడ ‘ప్రకృతి’తో ముడిపెట్టడం కొత్త అంశం. ఐతే ఎంతసేపూ నేచర్ నేచర్ అంటూ సినిమాలోని పాత్రలు తెగ వాయించేస్తుంటాయి కానీ కథాంశానికి.. ప్రకృతికి ఏదో బలవంతంగా ముడిపెట్టినట్లుంటుంది తప్ప అందులో సహజత్వం లేదు. దీంతో ముడిపడ్డ సన్నివేశాలు చాలా కృతకంగా తయారయ్యాయి కూడా. చివరికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ సైతం అసహజంగా.. ఇరికించినట్లే అనిపిస్తుంది.

ఒక సీన్లో హీరో తుమ్ముతాడు. హీరోయిన్ నవ్వుతుంది. పక్కనున్న మరో అమ్మాయి ఇందులో నవ్వాల్సిన విషయమేముందని ఆశ్చర్యపోతుంది. మనం కూడా అలాగే ఆశ్చర్యపోతాం. ఐతే హీరోతో హీరోయిన్ ప్రేమలో ఉండటం వల్లే అతను తుమ్మినా నవ్వేసిందట. ఆ విషయం ఫ్రెండు అర్థం చేసుకుని.. నువ్వు అతణ్ని ప్రేమిస్తున్నావ్ తెలుసా అని కథానాయికకు జ్నానోదయం చేస్తుంది. హీరోయిన్ కూడా అవును కదా అని ఆశ్చర్యపోయి నిజమే కదా అనుకుంటుంది. తర్వాతి సీన్లో హీరో కూడా హీరోయిన్ని ముద్దాడేస్తాడు. అతడు కూడా ప్రేమలో పడిపోయాడు కదా.. అర్రే అప్పుడే సినిమా అయిపోయిందే అనుకుంటుంటే.. కానీ తర్వాతి సీన్లో హీరో వేరే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు పడుతుంది ఇంటర్వెల్ కార్డు.

తన ముందే హీరో వేరే అమ్మాయికి ప్రపోజ్ చేసినా హీరోయిన్ మాత్రం హీరో తననే ప్రేమిస్తున్నాడంటూ అతడిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెడుతుంది. ద్వితీయార్ధమంతా ఈ వ్యవహారం మీదే కథ నడుస్తుంది. చివరికి హీరో కూడా తన అసలు ప్రేమను తెలుసుకుని బావామరదళ్లిద్దరూ ఒక్కటవడంతో కథ సుఖాంతమవుతుంది. సినిమా అంతటా లెక్కలేనన్ని మానసిక వికాస పాఠాలు.. థియరీలు సంభాషణల్లో ధ్వనిస్తుంటాయి. ఐతే ఏదైనా మాటల్లో చెప్పడమే తప్ప.. సన్నివేశాల ద్వారా కదలిక తెచ్చే ప్రయత్నం పెద్దగా జరగలేదు. ఒక రొటీన్ కథనే చాలా నాటకీయంగా చూపించారిందులో. మంజుల చెప్పాలనుకున్న విషయం మంచిదే కానీ.. దాన్ని సినిమా రూపంలో.. ప్రేక్షకుల్ని రంజింపజేసేలా చెప్పడంలో ఆమె విఫలమైంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు.. ఒకట్రెండు పాటలు మినహాయిస్తే సినిమా ఎంతమాత్రం ఎంగేజింగ్ గా అనిపించదు.

నటీనటులు:

ఎప్పుడూ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో కనిపించే సందీప్ కిషన్ ఈసారి రిచ్ కిడ్ క్యారెక్టర్ చేశాడు. ఈ పాత్ర అతడికి అంతగా సూటవ్వలేదు. గతంలో అతను చేసిన పాత్రల దృష్ట్యా అతను ఇంగ్లిష్ డైలాగులు చెబుతుంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అతడి నటన ఓకే. అమైరా దస్తూర్ పర్వాలేదు. కొన్ని సీన్లలో బాగా చేసింది. కొన్నిచోట్ల ఆమె హావభావాలు.. నటన అతిగా అనిపిస్తాయి. అదిత్ అరుణ్ బాగా చేశాడు. త్రిధా చౌదరి అందాల ప్రదర్శన చేయడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. ప్రియదర్శి.. పునర్ణవి.. సంజయ్ స్వరూప్.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

రధన్ మ్యూజిక్ పర్వాలేదు. ఒకట్రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రవి యాదవ్ ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయిమాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా పర్వాలేదు. కొన్ని కామెడీ చమక్కులు పేలాయి. ఇక దర్శకురాలు మంజుల పూర్తిగా నిరాశపరిచింది. రొటీన్ కథను ఎంచుకుని.. బోరింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించింది. మంచి ఉద్దేశాలున్నంత మాత్రాన మంచి సినిమాలు వచ్చేయవనడానికి మంజుల సిినిమా రుజువు చేస్తుంది.

చివరగా: ఆమె ‘మనసుకు నచ్చింది’.. కానీ మన మనసులకే..!

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre