Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ :‘మంచి రోజులు వచ్చాయి’

By:  Tupaki Desk   |   4 Nov 2021 6:53 AM GMT
మూవీ రివ్యూ :‘మంచి రోజులు వచ్చాయి’
X
చిత్రం : ‘మంచి రోజులు వచ్చాయి’

నటీనటులు: సంతోష్ శోభన్-మెహ్రీన్ పిర్జాదా-అజయ్ ఘోష్-వెన్నెల కిషోర్-ప్రవీణ్-వైవా హర్ష-సప్తగిరి-సుదర్శన్-రజిత తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్
నిర్మాణం: వి సెల్యులాయిడ్-ఎస్కేఎన్
రచన-దర్శకత్వం: మారుతి

దీపావళి కానుకగా తెలుగులో పెద్ద సినిమాల సందడేమీ లేదు. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించిన ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిన్న సినిమా పండక్కి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రోమోల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం సినిమాగా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

సంతోష్ (సంతోష్ శోభన్).. పద్మ (మెహ్రీన్ పిర్జాదా) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సహోద్యోగులు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి మూడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటారు. ఐతే పద్మను అమితంగా ప్రేమించే ఆమె తండ్రి గోపాలం (అజయ్ ఘోష్) తన కూతురు అబ్బాయిల జోలికే వెళ్లదని.. తాను చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటుందని ధీమాగా ఉంటాడు. కానీ అతణ్ని చూసి అసూయతో పొరుగిళ్లలో ఉండే ఇద్దరు వ్యక్తులు కూతురి గురించి లేని పోని భయాలు రేపి గోపాలంను అయోమయంలో పడేస్తారు. ఈ క్రమంలోనే పద్మ ప్రేమ గురించి గోపాలంకు తెలిసి తట్టుకోలేకపోతాడు. అతి భయస్థుడైన గోపాలంకు కూతురి జీవితం ఏమవుతుందో అన్న ఆందోళన పట్టుకుంటుంది. అలాగే సంతోష్ మీద ద్వేషమూ పెరిగిపోతుంది. మరి తనకు కాబోయే మామలో భయాన్ని.. తన పట్ల ద్వేషాన్ని పోగొట్టి పద్మను సంతోష్ తనదాన్ని ఎలా చేసుకున్నాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఈ తరం దర్శకుల్లో.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కామెడీ పండించడంలో మంచి నైపుణ్యమున్న దర్శకుల్లో మారుతి ఒకడు. టిపికల్ కాన్సెప్ట్స్ తీసుకుని వాటిని ఎంటర్టైనింగ్ గా తీయడంలో తనకున్న నైపుణ్యమేంటో అతను భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు.. లాంటి సినిమాల ద్వారా రుజువు చేశాడు. కథాకథనాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కామెడీతో పాస్ మార్కులు వేయించుకుని ప్రేక్షకులను సంతృప్తిపరచడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. ‘మంచి రోజులు వచ్చాయి’లో కూడా అతను చేసింది అదే. కాకపోతే ఇందులో కథ మరీ పలుచన అయిపోవడం.. కథనంలోనూ పెద్దగా విశేషాలేమీ లేకపోవడం.. కేవలం కొన్ని కామెడీ ఎపిసోడ్లను మాత్రమే నమ్ముకోవడంతో ప్రేక్షకుడికి ‘సోసో’ అనే ఫీలింగ్ తప్ప.. ఒక సంతృప్తికరమైన సినిమా చూసిన భావన కలగదు. చెప్పాలనుకున్న సందేశం బాగున్నా.. దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే సన్నివేశాలు లేకపోవడం.. కామెడీ కోసమని ఇల్లాజికల్ గా కథను నడపడం వల్ల ఆ సందేశం కూడా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కే అవకాశాలు లేవు.

మామూలుగా మారుతి సినిమాల్లో హీరోకు ఏదో ఒక లోపం పెట్టడం అలవాటు. ఐతే ఈసారి లోపాన్ని హీరోకు కాకుండా హీరో మామకు పెట్టడం వెరైటీ. ఐతే అదేమీ ‘భలే భలే మగాడివోయ్’ లాగా మతిమరుపో.. ‘మహానుభావుడు’లో మాదిరి ఓసీడీనో కాదు.. తనకు ఏదో జరిగిపోతుందనే అనవసర భయం. ఈ భయమే మనిషిని సగం చంపేస్తుందని.. నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న మనుషులకు దూరంగా ఉంటూ.. చుట్టూ పాజిటివ్ మనుషుల్నే పెట్టుకుంటే అంతకుమించిన ఆనందం.. ఆరోగ్యం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు మారుతి ‘మంచి రోజులు వచ్చాయి’లోన. కరోనా నేపథ్యంలో ఈ మైండ్ సెట్ మరింత అవసరమని కూడా చెప్పడం జరిగింది. ఐతే ఎప్పట్లాగే కామెడీ డోస్ తో ఈ సందేశాన్ని జనాల్లోకి ఎక్కించాలనుకున్నాడు కానీ.. కథ మరీ నాన్ సీరియస్ గా.. ఇల్లాజికల్ గా సాగడం.. చాలా వరకు సన్నివేశాలు బోరింగ్ గా ఉండటంతో ప్లాట్ పాయింట్ తాలూకు ఎమోషన్ ఎక్కడా ప్రేక్షకులకు ఎక్కదు.

తన కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తే తండ్రి కంగారెత్తిపోయి.. ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వడం.. ఆ అబ్బాయి రివర్సులో ఫైర్ అవడం.. తర్వాత ఇద్దరి మధ్య డిష్యుం డిష్యుం.. ఆపై అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు ప్రయత్నించడం.. అబ్బాయి అడ్డు పడటం.. ఇలా రొటీన్ ఫార్మాట్లో సాగిపోయే ‘మంచి రోజులు వచ్చాయి’ ప్రథమార్ధంలో ఏ సన్నివేశం కూడా లాజికల్ గా మాత్రం అనిపించదు. ఈ ప్రేమకు సంబంధించి హీరోతో హీరోయిన్ తండ్రి.. హీరోయిన్ తండ్రితో హీరో.. అలాగే హీరోతో హీరోయిన్ వ్యవహరించే తీరు సిల్లీగా అనిపిస్తాయి. హీరో తన తండ్రిని తిట్టాడనగానే పెళ్లిచూపులకు రెడీ అయిపోవడమేంటో.. హీరోయిన్ అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటే హీరో కూల్ గా పెళ్లిచూపులు చెడగొట్టే పనిలో పడ్డమేంటో అర్థం కాదు. కామెడీ పేరుతో విచిత్ర విన్యాసాలన్నీ చేయించారు. కాకపోతే మధ్యలో అప్పడం విజయలక్ష్మి పేరుతో ఓ కల్పిత పాత్రను ప్రవేశపెట్టి దాని చుట్టూ నడిపించిన కామెడీ మాత్రం నవ్విస్తుంది. కామెడీ కాబట్టి సర్దుకుపోవాలి కానీ.. లాజిక్ తో చూస్తే ఈ ట్రాక్ సైతం సిల్లీగానే తోస్తుంది.

ప్రథమార్ధంలో ఏమీ లేనట్లు అనిపించాక.. ద్వితీయార్ధం కాస్త నయంగానే అనిపిస్తుంది. ఇందుక్కారణం కామెడీ డోస్ కొంచెం పెరగడమే. ప్రథమార్ధంలో మెరిసి మాయమైన అప్పడాల విజయలక్ష్మి ద్వితీయార్ధంలో రీఎంట్రీ ఇచ్చి సైలెంటుగా ఉన్న ప్రేక్షకులను ఒక ఊపు ఊపి వెళ్లిపోతుంది. సుదర్శన్ కూడా తోడవడంతో ఆ సీన్లో మాత్రం ఆడిటోరియాలు దద్దరిల్లే రేంజిలో నవ్వులు పండాయి. ఇంకోవైపు వెన్నెల కిషోర్ సైతం రెండు మూడు సీన్లలో కామెడీ పండించడంతో ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం బెటర్ అనిపిస్తుంది. ఐతే హీరో హీరోయిన్ల ప్రేమకథలో రవ్వంత కూడా ఎమోషన్ కనిపించదు. వాళ్ల కలయిక సంతోషాన్నివ్వదు. ఎడబాటు బాధ కలిగించదు. నేరుగా వారిని ప్రేమికులుగా చూపించడం.. తర్వాత కూడా ఇద్దరి మధ్య అంతగా ప్రేమ అంటూ ఏమీ చూపించకపోవడం.. ఆ పాత్రలతో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేం. వాటితో పోలిస్తే అజయ్ ఘోష్ పాత్రతోనే ప్రేక్షకులు ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. కరోనా టైంలో జనాల అనవసర భయాలను గుర్తుకు తెచ్చేలా ఈ పాత్ర నడుస్తుంది. అసలే భయస్థుడు.. పైగా కరోనా కాన్సెప్ట్ కూడా తీసుకురావడంతో ఈ తరహా మనుషుల్ని చాలామందిని చూశాం కాబట్టి ఆ పాత్రతో ఐడెంటిఫై అవుతాం. ఇక చివర్లో కరోనా-మదర్ సెంటిమెంట్ చుట్టూ కథను కొంచెం ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు మారుతి. కానీ మొదట్నుంచి కథలో పెద్దగా సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక్కసారిగా ప్రేక్షకులు కదిలిపోవాలంటే కష్టం. చివరగా సినిమా ఎలా ఉందంటే.. మొదట్లో వచ్చిన ‘సోసోగా..’ అనే పాటను గుర్తు చేసి ముగించడం తప్ప ఏమీ చేయలేం.

నటీనటులు:

సంతోష్ శోభన్ ఇప్పటికే తనలో మంచి ఈజ్ ఉందని చూపించాడు. ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. పక్కింటి కుర్రాడి పాత్రల్లో సులువుగా ఒదిగిపోగలనని అతను చాటుకున్నాడు. ‘ఏక్ మిని కథ’ ఇచ్చిన కాన్ఫిడెన్సు‌తో ఈ సినిమాలో మరింత హుషారుగా నటించాడు. అతడి ట్రెండీ లుక్స్.. అప్పీయరెన్స్ యువతను ఆకట్టుకుంటాయి. నటన పరంగా కొత్తగా పెద్దగా చేయడానికేమీ లేకపోయినా.. ఉన్నంతలో నీట్ పెర్ఫామెన్స్ తో సంతోష్ మెప్పించాడు. మెహ్రీన్ పిర్జాదా పాత్రకు అవసరమైన మేర నటించింది. ఐతే మరీ బక్కచిక్కిపోయిన ఆమె.. కొన్ని చోట్ల కళా విహీనంగా కనిపించింది. అర్జెంటుగా ఆమె కొంచెం ఒళ్లు చేస్తే బెటరేమో. అజయ్ ఘోష్ తన కెరీర్లోనే అత్యంత ప్రాధాన్యమున్న పాత్రలో మెప్పించాడు. హీరో హీరోయిన్లను మించి స్క్రీన్ టైం ఉన్న పాత్రను ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. కొన్ని చోట్ల మాత్రం అజయ్ నటన అతిగా అనిపిస్తుంది. మరీ నాటుగా కనిపించే ఆయన.. మెహ్రీన్ కు తండ్రిగా పెట్టడం మాత్రం కొంచెం అతకనట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్.. సుదర్శన్.. ప్రవీణ్.. ఈ ముగ్గురూ తాము కనిపించినంతసేపు నవ్వించారు. సప్తగిరి.. వైవా హర్ష పర్వాలేదు. మూర్తిగా నెగెటివ్ రోల్ చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. ‘బస్ స్టాప్’ ఫేమ్ కోటేశ్వరరావు కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

అనూప్ రూబెన్స్ పాటలు చాలా బాగున్నాయనలేం. అలా అని తీసి పడేయలేం. సోసోగా.. మంచి రోజులు వచ్చాయి.. పాటలు కొంచెం వినసొంపుగా ఉన్నాయి. ఎక్కేసిందే పాట పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. మారుతి శైలికి తగ్గట్లుగా కలర్ ఫుల్ గా సాగింది సినిమాటోగ్రఫీ. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. చిన్న సినిమా అయినా రిచ్ గానే కనిపిస్తుంది. ఇక దర్శకుడు మారుతి విషయానికొస్తే.. అతను స్క్రిప్టు విషయంలో పెద్దగా కసరత్తు చేసినట్లయితే కనిపించదు. హడావుడిగా రాసి.. తీసేసినట్లనిపిస్తుంది. బేసిగ్గా అతడికి కామెడీ మీద ఉన్న పట్లు వల్ల కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్వించగలిగాడు. అంతే తప్ప.. కథాకథనాలతో అంతగా మెప్పించలేకపోయాడు. దర్శకుడిగా.. రచయితగా మారుతి వీక్ వర్క్స్ లో ‘మంచి రోజులు వచ్చాయి’ ఒకటనడంలో సందేహం లేదు.

చివరగా: మంచి రోజులు వచ్చాయి.. కొన్ని నవ్వుల కోసం

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre