Begin typing your search above and press return to search.

ఆ కేసులో మంచు ఫ్యామిలీకి హైకోర్టులో ఊరట

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:04 AM GMT
ఆ కేసులో మంచు ఫ్యామిలీకి హైకోర్టులో ఊరట
X
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబుకు.. ఆయన ఇద్దరు కుమారులకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. ఒక కేసులో వీరు ముగ్గురికి భారీ రిలీఫ్ దక్కినట్లేనని చెబుతున్నారు.

2019 ఎన్నికల సమయంలో వీరిపై నమోదైన కేసుకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఊరట ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే.

2019లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల వేళలో మోహన్ బాబు.. మంచు విష్ణు.. మనోజ్ లు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉందన్న విషయం తెలిసిందే.

అప్పట్లో బాబు ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న మోహన్ బాబు.. ఆయన ఇద్దరు కుమారులు తిరుపతి - మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

ఇలాంటి సమయాల్లో పబ్లిక్ ప్లేసుల్లో ధర్నాలు నిర్వహించటంపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో.. వీరి ముగ్గురిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా హైకోర్టులో ఈ కేసుపై మోహన్ బాబు.. ఆయన ఇద్దరు కుమారులు ఇద్దరు విచారణను నిలిపివేయాలని కోరారు.

దీనికి సంబంధించి ఎనిమిది వారాలు వాయిదా వేయటం.. మోహన్ బాబు.. ఆయన ఇద్దరు కుమారులకు బిగ్ రిలీఫ్ గా మారినట్లుగా చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.