Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి అంత మాటనేసిందేంటి..

By:  Tupaki Desk   |   30 March 2016 8:51 AM GMT
మంచు లక్ష్మి అంత మాటనేసిందేంటి..
X
మంచు లక్ష్మి ‘మేము సైతం’ పేరుతో ఓ మంచి కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల్ని సామాజిక కార్యక్రమాల్లో భాగం చేసే రియాల్టీ షో తరహా కార్యక్రమం ఇది. దీని కోసం రానాతో మూటలు మోయించింది.. రకుల్ ప్రీత్ తో కూరగాయలు అమ్మించింది.. తన తండ్రి మోహన్ బాబుతో హోటల్ పెట్టించి.. టిఫిన్లు కూడా అమ్మించింది. ఈ కార్యక్రమానికి జెమిని టీవీ మంచి ప్రచారమే కల్పిస్తూ.. బాగానే ప్రమోట్ చేస్తోంది. ఐతే ఇలాంటి మంచి కార్యక్రమంతో ముందుకొచ్చిన లక్ష్మి.. నిన్న ఓ ప్రెస్ మీట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ సెలబ్రెటీలకు కాక పుట్టిస్తున్నాయి.

ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలకు టాలీవుడ్ సెలబ్రెటీల్ని రప్పించడం చాలా చాలా కష్టమని వ్యాఖ్యానించింది లక్ష్మి. బాలీవుడ్లో ఇలాంటి కార్యక్రమాలంటే చాలామంది ముందుకొస్తారని.. ఉత్సాహంగా పాల్గొంటారని.. కానీ టాలీవుడ్ జనాలు మాత్రం అంతగా స్పందించరని మంచు లక్ష్మి చెప్పింది. ‘‘ఇదిగో.. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కు వీళ్లందరినీ రప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది’’ అంటూ ఆ కార్యక్రమానికి వచ్చినర అతిథుల్ని చూపిస్తూ మరో సెన్సేషనల్ కామెంట్ చేసింది లక్ష్మి. దీంతో ఆ ప్రెస్ మీట్ కు వచ్చిన రకుల్ ప్రీత్.. సుశాంత్..తదితరులు అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. మంచు లక్ష్మి అన్న మాటల్లో నిజం ఉండొచ్చేమో కానీ.. కాస్త బెట్టు చేసైనా సరే కొందరు సెలబ్రెటీలు మంచు లక్ష్మికి సహకారమైతే అందిస్తున్నారు కదా. అందుకు సంతృప్తి చెందకుండా ఇలాంటి కామెంట్లు చేస్తే మున్ముందు వీళ్లు కూడా ముఖం చాటేయరూ.