Begin typing your search above and press return to search.

మంచు మనోజ్ 40 నిమిషాలు ఔట్

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:55 AM GMT
మంచు మనోజ్ 40 నిమిషాలు ఔట్
X
మన సినిమాలు ప్రధానంగా హీరోల చుట్టూనే తిరుగుతాయి. కొంచెం భిన్నమైన కథలు ఎంచుకున్నా కూడా అందులో హీరోనే ప్రధానంగా ఉంటాడు. ప్రతి సన్నివేశంలోనూ హీరో కనిపించేలాగే కథాకథనాలు రాసుకుంటారు దర్శకులు. హీరో ఓ పది నిమిషాలు కనిపించకుంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది మన ప్రేక్షకులకు. అలాంటిది మన హీరో ఒక సినిమాలో 40 నిమిషాల పాటు కనిపించకపోతే ఎలా ఉంటుంది? మంచు మనోజ్ కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’లో అదే జరగబోతోంది. ఈ విషయాన్ని మనోజే స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ సినిమా ద్వితీయార్ధంలో 40 నిమిషాల పాటు మనోజ్ కనిపించడట.

‘ఒక్కడు మిగిలాడు’ శ్రీలంకలో తమిళుల అవస్థలు - వారి పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇందులో మనోజ్ ఎల్టీటీఈ ప్రభాకరన్ ను స్ఫూర్తితో అల్లిన ఓ పాత్ర.. వర్తమానంలో ఉండే ఓ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషించాడు. ఇందులో దర్శకుడు అజయ్ నూతక్కి కూడా ఓ కీలక పాత్ర చేశాడు. ఆ పాత్ర ద్వితీయార్ధంలో లీడ్ తీసుకుంటుంది. శ్రీలంక నుంచి ఓ బృందం ఓ పడవలో బయల్దేరి సముద్రం మీదుగా ఇండియాకు వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణమట. ఆ సన్నివేశాల్లో అజయే కనిపిస్తాడట. మనోజ్ పాత్రే ఉండదట. సినిమాకు ఇదే అత్యంత కీలకమైన ఎపిసోడ్ అని.. ఇది ప్రేక్షకులను కదిలిస్తుందని అంటున్నాడు మనోజ్. తన లాంటి హీరోలు ఇలాంటి భిన్నమైన.. ప్రయోగాత్మక సినిమాలు చేయాల్సిన అవసరముందని.. ఇక్కడ ఇమేజ్ గురించి.. స్క్రీన్ టైం గురించి ఆలోచించకూడదని మనోజ్ అభిప్రాయపడ్డాడు.