Begin typing your search above and press return to search.

ఒక్కడు మిగిలాడు.. అక్కడ ఆకర్షిస్తాడా?

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:41 AM GMT
ఒక్కడు మిగిలాడు.. అక్కడ ఆకర్షిస్తాడా?
X
ప్రస్తుత రోజుల్లో ఇండియాలో ఏడాదికి వేల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ భాషకి తగ్గట్టుగా వారు వారి స్థాయిలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇక చిన్న చిన్న సినిమాల్లో కంటెంట్ బావుంటే 100 కోట్లను ఈజీగా దాటేస్తూ.. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని కథలు దేశ ప్రముఖులను మరియు ప్రపంచ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని చిత్రాలు అంతర్జాతీయ చలన చిత్ర వేడుకలలో రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో మంచు మనోజ్ నటించిన "ఒక్కడు మిగిలాడు" సినిమా కూడా ఇంటర్ నేషనల్ మూవీ ఫెస్టివల్స్ కి పంపనున్నారట.

శ్రీలంకన్ సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎల్టిటిఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ నటించాడు. అలాగే ఒక కాలేజ్ కుర్రాడిగా మరో పాత్ర కూడా చేస్తున్నాడట. ట్రైలర్ తో భారీ అంచనాలను రేపిన ఈ సినిమా ప్రపంచ ప్రముఖులు హాజరయ్యే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఆడనుందని టాక్. అలాంటి వేడుకలలో కేవలం కొన్ని అరుదైన చిత్రాలనే ప్రదర్శిస్తారు. బాహుబలి మొదటి సారిగా ఒక దృశ్య కావ్యంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి కొన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో విజయవంతంగా ప్రదర్శించారు. అలాగే చరిత్రలో ఎక్కువగా పాపులర్ అయిన కథలను కూడా అక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పుడు అదే తరహాలో తెరకెక్కిన "ఒక్కడు మిగిలాడు" కూడా తప్పకుండా ప్రపంచ సినీ వేడుకల్లో ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అప్పట్లో ఎల్టీటీఈ ప్రభాకరన్ వార్ కూడా ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరిచింది. దీంతో తప్పకుండా ప్రముఖులు ఈ సినిమాను చూడటానికి ఆసక్తిని చూపుతారని సినిమా యూనిట్ భావిస్తోంది. అనుకున్నట్టు జరిగితే ఆ ప్రదర్శన సినిమా ప్రమోషన్స్ కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఈ సినిమాను అజయ్ ఆండ్రూ తెరకెక్కించగా ఎస్.ఎన్ రెడ్డి - లక్ష్మి కాంత్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 8న ఒక్కడు మిగిలాడు తెలుగు-తమిళ్ లో రిలీజ్ కానుంది.