Begin typing your search above and press return to search.

ఇలాంటి సినిమా కోసం చచ్చిపోవచ్చు-మనోజ్

By:  Tupaki Desk   |   21 Aug 2017 11:00 PM IST
ఇలాంటి సినిమా కోసం చచ్చిపోవచ్చు-మనోజ్
X
ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం అని నటీనటులు.. టెక్నీషియన్లు అనడం మామూలే. చాలా వరకు ఇలాంటివి మాట వరసకే అంటుంటారు. ఐతే మంచు మనోజ్ ఓ అడుగు ముందుకేశాడు. ‘ఒక్కడు మిగిలాడు’ లాంటి సినిమా కోసం చచ్చిపోయినా పర్వాలేదని అతను వ్యాఖ్యానించాడు. తన కెరీర్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని.. గొప్ప సినిమా కూడా అని.. ఇలాంటి సినిమా కోసం చచ్చిపోయినా పర్వాలేదని అతనన్నాడు. ఓ మామూలు సినిమా కోసం చచ్చిపోతే ఎవరూ గుర్తించరని.. కానీ ‘ఒక్కడు మిగిలాడు’ లాంటి సినిమా కోసం చచ్చిపోతే.. అలాంటి గొప్ప సినిమా చేస్తూ చనిపోయాడని గుర్తు పెట్టుకుంటారని మనోజ్ అనడం విశేషం.

తన కెరీర్లో ఇంతకుముందు కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేశానని.. ఐతే ‘ఒక్కడు మిగిలాడు’ కేవలం భారీ సినిమా మాత్రమే కాదని.. గొప్ప సినిమా అని మనోజ్ వ్యాఖ్యానించాడు. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు కూడా పంపించాలనుకుంటున్నట్లు మనోజ్ తెలిపాడు. తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని.. శ్రీలంకలో తమిళులు పడ్డ కష్టాలు.. వాళ్ల పోరాటం గురించి కొంత తెలుసని.. ఐతే దర్శకుడు అజయ్ నూతక్కి ‘ఒక్కడు మిగిలాడు’ కథను తనకు చెప్పినపుడు ఆశ్చర్యపోయానని.. మనుషుల అసలైన కష్టాలంటే ఏంటో తనకు ఈ సినిమాతోనే తెలిసొచ్చిందని మనోజ్ తెలిపాడు. ఈ కథ అందరికీ తెలియాల్సి ఉందని.. అందుకే ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాను దేశవ్యాప్తంగా.. నాలుగు భాషల్లో (తెలుగు-తమిళం-హిందీ-మలయాళం) రిలీజ్ చేయబోతున్నట్లు మనోజ్ వెల్లడించాడు.