Begin typing your search above and press return to search.
కమల్ సీఎం కావాలి: మంచు మనోజ్
By: Tupaki Desk | 9 Nov 2017 11:57 AM GMTదివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడులో రాజకీయాలు పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం, విశ్వ నటుడు కమల్ హాసన్ ఏకంగా రాజకీయాల్లోకి వచ్చేశానంటూ ప్రకటించడంతో తమిళ రాజకీయాలకు సినీ గ్లామర్ అద్దినట్లయింది. రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న అంశంపై తమిళనాడులో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ హీరోలలో కొందరు కమల్ కు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా, ఆ అంశంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. కమల్ హాసన్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు.
కమల్ హాసన్ మేధావి అని, ఆయనకు అన్ని విషయాలపై మంచి అవగాహన ఉందని మనోజ్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందన్నాడు. నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ కమల్ అంటే తనకిష్టమని తెలిపాడు. మన దగ్గర రాజకీయ పరిస్థితులు బాగున్నాయని, తమిళనాడులో బాగా లేవని చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ప్రజాసేవ చేయాలని, వారి సమస్యలపై పోరాడాలని ఉందన్నాడు. ప్రత్యేకించి రైతులను ఆదుకోవాలని ఉందని, ఆ దిశగా ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తున్నానని మనోజ్ తెలిపాడు. అయితే, రజనీకాంత్ కు మోహన్ బాబు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. అటువంటిది, మనోజ్...రజనీకి మద్దతుగా మాట్లాడకుండా, ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించకుండా కమల్ కు మద్దతు పలకడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, రజనీ ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయలేదు కాబట్టి మనోజ్ సేఫ్ గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఒకవేళ రజనీ రాజకీయ అరంగేట్రం చేశాక మనోజ్ మద్దతు ఆయనకే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో!