Begin typing your search above and press return to search.

ప్ర‌ణయ్ హత్యపై మంచు మనోజ్ ట్వీట్!

By:  Tupaki Desk   |   17 Sep 2018 1:28 PM GMT
ప్ర‌ణయ్ హత్యపై మంచు మనోజ్ ట్వీట్!
X
మిర్యాల గూడ‌లో ప్ర‌ణ‌య్ `ప‌రువు` హ‌త్య పెను సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ణ‌య్ కుల హ‌త్య‌ను ప‌లువురు రాజ‌కీయ నాయకులు - సెల‌బ్రిటీలు తీవ్రంగా ఖండించారు. పేరు వెనుక ఉన్న తోక‌లు కత్తిరిస్తే గానీ ఇటువంటి హ‌త్య‌లు ఆగ‌వ‌ని....టాలీవుడ్ సింగ‌ర్ - డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ప్ర‌ణ‌య్ హ‌త్యోదంతంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. ఆ హ‌త్య‌ను మ‌నోజ్ తీవ్రంగా ఖండిస్తూ ....ఓ భావోద్వేగ లేఖను త‌న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఏ రంగంలోనైనా కులాన్ని స‌మ‌ర్థించే వారంతా ప్ర‌ణ‌య్ వంటి హ‌త్యోదంతాల‌కు బాధ్య‌త వ‌హించాల‌ని మ‌నోజ్ అన్నాడు. మ‌న‌మంతా ఒకే సమాజంలో జీవిస్తున్న‌పుడు కులం పేరుతో ఈ వివ‌క్ష ఎందుని మ‌నోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

కుల పిచ్చి ఉన్న‌ సినీ నటులు(ఫ్యానిజం) - రాజకీయ పార్టీలు - కాలేజ్ యూనియన్లు - కుల - మత సంస్థలు అన్నీ అనాగరికమైనవేన‌ని మ‌నోజ్ అన్నాడు. హృదయం - శరీరం ఒకే తీరుగా ఉన్న మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నామని .. కులం పేరుతో ఈ వివక్ష ఎందుకని ప్ర‌శ్నించాడు. కులపిచ్చిని రూపుమాపాల‌ని - వెంట‌నే నివారించాల్సిన అతి పెద్ద రోగం కుల‌పిచ్చి అని అన్నాడు. క‌ళ్లు తెరచి.. మనుషుల్లా ప్రవర్తిద్దామ‌ని - కుల‌ర‌హిత సమాజాన్ని భావిత‌రాల‌కు అందిద్దామ‌ని మ‌నోజ్ పిలుపునిచ్చాడు. కుల పిచ్చి వ‌ల్ల ఇంకా లోకాన్నే చూడని పసికందు... తన తండ్రి స్పర్శను తెలుసుకోకముందే... అతని చేతిని పట్టుకోకముందే... తండ్రిని కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప్రణయ్ భార్య అమృత - ప్ర‌ణ‌య్ కుటుంబసభ్యులకు మ‌నోజ్ సానుభూతిని తెలియజేశాడు. ప్ర‌ణ‌య్ ఆత్మకు శాంతి కలగాల‌ని కోరుకుంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.