Begin typing your search above and press return to search.

సీఎం ఆహ్వానం నాన్నకు అందకుండా చేసారు: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   15 Feb 2022 12:04 PM GMT
సీఎం ఆహ్వానం నాన్నకు అందకుండా చేసారు: మంచు విష్ణు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో మంచు విష్ణు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన విష్ణు.. సీఎంతో కలిసి భోజనం చేసారు.

ఇటీవల చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్ నారయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు సీఎం జగన్‏ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ను మంచు విష్ణు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది తమ వ్యక్తిగత భేటీ మాత్రమేనని విష్ణు తెలియజేశారు.

మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జగన్ ను కలవడం ఇదేమీ మొదటిసారి కాదని మూడవసారి అని అన్నారు. వ్యక్తిగతంగా కలిసాను కాబట్టి ఆ విషయాలేవీ వెల్లడించంలేదని.. ఇప్పుడు ఫ్లైట్ లో వచ్చాను కాబట్టి అందరికీ తెలిసిందని అన్నారు.

''100 పెర్సెంట్ తిరుపతిలో స్టూడియో కడతా. ప్రభుత్వ సహకారం కోసం మళ్లీ వచ్చి కలుస్తాను. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి 30ఏళ్లు అయిన తర్వాత అది ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. దానికి సంబంధించి మరొక ప్రెస్ మీట్లో వివరిస్తాను'' అని విష్ణు అన్నారు.

''రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు. వైజాగ్ లో మాకు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి మాట్లాడిన తర్వాత ఎలా పార్శియల్ గా ఎలా షిప్ట్ అవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం'' అని తెలియజేసారు.

ఇటీవల సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీపై స్పందిస్తూ.. ''మిస్ కమ్యూనికేషన్ వల్ల నాన్నగారు మొన్న జరిగిన మీటింగ్ కు హాజరు కాలేకపోయారు. ఎక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందో మేమందరం మాట్లాడతాం. పేర్నినాని గారితో మాట్లాడినప్పుడు మాకు ఆయన క్లారిటీగా చెప్పారు.

నాన్నగారితో పాటు మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోలకూ ఆహ్వానం పంపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయలేదు. అంతేకానీ నాన్నగారిని పిలవలేదు అనేది దుష్పచారం మాత్రమే'' అని అన్నారు విష్ణు.

''సీనియర్ నటుడు, లెజెండరీ యాక్టర్ అయిన నాన్నగారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఎవరు దాన్ని అందకుండా చేశారో అంతర్గతంగా మాకు తెలుసు.

త్వరలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో దీని పైనా చర్చిస్తా. అది మా ఇంటర్నల్ మ్యాటర్. మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. మాలో మాకు ఏ సమస్య వచ్చినా మేమంతా కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం''

''ఇటీవల పేర్నినాని గారు ఇంటికి వచ్చి నాన్నను కలిసినప్పుడు ఎందుకో తెలియదు ఓ వర్గం మీడియా సంస్థలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేశాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. మేమంతా స్నేహితులం.

వైసీపీలో మా ఫ్యామిలీ సభ్యులు ఉన్నప్పటికీ నాకు టీడీపీలో ఎందరో ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక పర్పస్ మీద ఒకరినొకరం కలుసుకోవడం అనడం తప్పు. పేర్ని నాని గారు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫంక్షన్ కు వచ్చారు. అప్పుడు నాన్న ఫోన్ చేసి టిఫిన్ కి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వచ్చారు''

''టికెట్ రేట్ల సమస్యతో పాటు, స్టూడియో విషయాలు.. ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని అభినందిస్తూ 'థ్యాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్' అని ట్వీట్ పెట్టా.

కానీ ఆ ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకుని, ఎన్నో విధాలుగా దాన్ని మార్చి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. నేను ట్వీట్ ఎడిట్ చేయడాన్ని కూడా కొన్ని ఛానల్స్ లో నెగెటివ్ గా చూపించారు. 2+2 అనేది 22 అయిపోదు''

''జగన్ అన్నతో మాట్లాడినవన్నీ వ్యక్తిగత విషయాలు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ ఈ వేదికగా మీద వాటి గురించి మాట్లాడాను.

మంచు ఫ్యామిలీకి సపోర్ట్ లేకపోతే నేను 'మా' ప్రెసిడెంట్ గా ఎవరూ గెలవనంత మెజారిటీతో గెలిచేవాడినా? నాకు అపోజిషన్ లో ఉన్నవాళ్ళని చిత్తుచిత్తుగా ఓడగొట్టి.. వాళ్ళకి సపోర్ట్ చేసిన వారికి కూడా ఈ ఎన్నికలతో జవాబు చెప్పా. సపోర్ట్ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నా చిత్ర పరిశ్రమ అంతా ఒక ఫ్యామిలీ.

ఏ సమస్య వచ్చినా మేమే పరిష్కరించుకుంటాం. 'మా' ఎన్నికల్లో వచ్చిన వివాదాల వల్లే నాకు ఆహ్వానం రాలేదనేది అవాస్తవం" అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.