Begin typing your search above and press return to search.

విజయం సాధించగానే ఉద్వేగానికి లోనైన మంచు విష్ణు!

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:52 AM GMT
విజయం సాధించగానే ఉద్వేగానికి లోనైన మంచు విష్ణు!
X
ఈ సారి 'మా' ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రస్థాయిలో జరిగే ఎన్నికల హడావిడిని తలపించాయి. ఒకవైపున మంచు విష్ణు .. మరో వైపున ప్రకాశ్ రాజ్ పోటాపోటీగా తమ ప్రచారాలను సాగించారు. ఆరోపణలు చేసుకోవడంలో ఎవరూ కూడా వెనక్కి తగ్గలేదు. 'లైవ్ షో'ల కారణంగా వాతావరణం మరింత వేడెక్కింది. ఇక వాళ్లని సపోర్ట్ చేసేవారు తమ అభిప్రాయాలను వీడియోలుగా చేసి వదలడం మొదలెట్టారు. ఆ వీడియోలు కూడా ఒక రేంజ్ లో వైరల్ కావడం మొదలైంది.

ఒక వైపున ప్రకాశ్ రాజ్ .. మరో వైపున మంచు విష్ణు ఇద్దరూ కూడా 'మా' ఎన్నికలను పతాకస్థాయికి తీసుకువెళ్లారు. మొత్తానికి నిన్న మంచి జోరుగానే పోలింగ్ కొనసాగింది. ఇండస్ట్రీకి సంబంధించిన ఈ సందడిని అందరూ ఉత్కంఠంగా పరిశీలించారు. 'నువ్వా? నేనా?' అన్నట్టుగా హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో ఫలితాలు నిన్న రాత్రి వెలువడ్డాయి. కౌటింగులో కూడా ఇద్దరూ ఒకసారి ఒకరు .. ఆ తరువాత మరొకరు అన్నట్టుగా ముందంజలో ఉంటూ వచ్చారు. అంతా ఏం జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తుండగా ఫలితాలు వెలువడ్డాయి.

'మా ' ఎన్నికలలో మంచు విష్ణు విజయాన్ని సాధించినట్టుగా ప్రకటన వెలువడింది. ప్రకటనకు ముందు విష్ణు విపరీతమైన మానసిక వత్తిడికి లోనైనట్టుగా కనిపించాడు. తాము విజయం సాధించినట్టు తెలియగానే ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన భుజం తడుతూ కంట్రోల్ చేయడానికి సన్నిహితులు కొందరు ప్రయత్నించారు. కన్నీళ్లు తుడుచుకున్న విష్ణును, ప్రకాశ్ రాజ్ అభినందించాడు. అప్పుడు కన్నీళ్లతోనే విష్ణు ఆయనను హత్తుకున్నాడు. ప్రకాశ్ రాజ్ ఆయన భుజం తడుతూ, ఆయనను ఆ ఎమోషన్ నుంచి బయటికి తీసుకు రావడానికి ప్రయత్నించాడు.

ఆ తరువాత విష్ణు మాట్లాడుతూ .. తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పాడు. అక్కడికి చేరుకున్న మోహన్ బాబు మాట్లాడుతూ .. "తన బిడ్డకు 'బాబా' ఆశీస్సులు ఉండటం వలన .. 'మా' సభ్యుల ఆదరణ కారణంగా విజయాన్ని సాధించాడని చెప్పారు. ఇక చిరంజీవి .. పవన్ .. నాగార్జున ఆశీస్సులు కూడా తన బిడ్డకు లభించాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు తన బిడ్డకు ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల సందర్భంగా విష్ణు ఏ హామీలైతే చేశాడో .. వాటన్నింటిని కూడా నెరవేరుస్తాడని మోహన్ బాబు చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే అభివృద్ధికి విష్ణు కట్టుబడి పనిచేస్తాడని అన్నారు. "జరిగిందేదో జరిగిపోయింది .. ఎవరు ఎలాంటి విషయాలను మనసులో పెట్టుకోవద్దు. మనందరం ఒక తల్లి బిడ్డలం. ఇక ఈ వివాదాలకు .. ఆరోపణలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం .. కలిసి పనిచేద్దాం" అంటూ మోహన్ బాబు మాట్లాడారు.