Begin typing your search above and press return to search.

'మా' లో భారీ ప్ర‌క్షాళ‌న‌..విష్ణు అండ్ కో కొత్త రూల్స్!

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:55 AM GMT
మా లో భారీ ప్ర‌క్షాళ‌న‌..విష్ణు అండ్ కో కొత్త రూల్స్!
X
'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) కొత్త బాడీ ఏర్పాటై ఏడాది పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఏర్పాటైన కొత్త కార్య‌వ‌ర్గం ఈసంద‌ర్భంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ఏడాది పాల‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు త‌న‌యుడి పాల‌న‌ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

'మా ఎన్నిక‌ల్లో విష్ణు ఓడిపోవాల‌ని కోరుకున్న వారు బాగుండాలి. నేను అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన‌ప్పుడు ఎలాంటి మీటింగ్ లు పెట్ట‌లేదు. కానీ చేసిన ప‌ని గురించి తెలిజ‌య‌జేయం అన్న‌ది మంచి ప‌ని. సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డం కాదు. స‌భ్యులంద‌రికీ శిరిడీ సాయి ఆశిస్సులుండాలి. అంతా ఐక్యంగా ఉండాలి. విష్ణు ప‌నిలో మోసం..ద‌గా లేదు. తాను చెప్పిన వ‌న్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు' అని అన్నారు.

అలాగే విష్ణు మాట్లాడుతూ.. 'గ‌తేడాది ఆక్టోబ‌ర్ 13 అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్నా. సాధార‌ణ ఎన్నిక‌లు త‌ల‌పించేలా పోటీ వాతావ‌ర‌ణంలో గెలిచాను. నేను మాకే కాదు. ప్ర‌జ‌లంద‌రికీ జ‌వాబుదారిని. చేసిన వాగ్దానాల‌లో 90 శాతం పూర్త‌య్యాయి. 'మా'లో న‌టులు కాని స‌భ్యులున్నారు. వాళ్ల‌ని తొల‌గించా. స‌భ్య‌త్వం విష‌యంలో చాలా క‌ఠినంగా ఉండాల‌ని నిర్ణ‌యించా.

న‌టీనటులు రెండు సినిమాల్లో న‌టించి.. ఆ సినిమాలు విడుద‌లైతే శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పిస్తాం. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయితే 10 సినిమాలైనా చేసి ఉండాలి. ఐదు నిమిషాలైనా తెర‌పై క‌నపించాలి. అసోసియేట్ స‌భ్యుల‌కు 'మా'లో ఓటు హ‌క్కు లేదు. స‌భ్య‌త్వం ఉన్న వారికే సినిమాల్లో ఛాన్సులివ్వాల‌ని నిర్మాత‌ల‌కు సూచించాం. మాకు వ్య‌తిరేకంగా న‌టులు..కార్య‌వ‌ర్గ స‌భ్యులు కామెంట్లు పెడితే? వారిని శాశ్వ‌తంగా 'మా' నుంచి తొల‌గిస్తాం.

ఇక 'మా' భ‌వ‌నానికి రెండు ప్ర‌తిపాద‌నలు సూచించా. ఫిల్మ్ న‌గ‌ర్ స‌మీపంలో ఓ భ‌వ‌నం నిర్మిస్తున్నాం. అలాగే ప్ర‌స్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబ‌ర్ భ‌వ‌నాన్ని కూల్చి కొత్త భ‌వ‌నం కట్టేందుకు అయ్యే ఖ‌ర్చు నేను భ‌రిస్తా. చాలా మంది స‌భ్యులు భ‌వ‌నం కూల్చేసి కొత్త‌ది క‌డ‌దామ‌నే అంటున్నారు. న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ఓ బుక్ లెట్ రెడీ చేసి నిర్మాత‌ల కౌన్సిల్ కి అందించా.

దీని ద్వారా కొంత మందికి అవ‌కాశాలు వ‌చ్చాయి. అలాగే మోబైల్ యాప్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. అది సంక్రాంతి త‌ర్వాత అందుబాటులోకి వ‌స్తుంది. స‌మ‌గ్ర సినిమా స‌మాచారం అందులో పొందు ప‌రుస్తాం. సినిమా అప్ డేట్స్ అన్ని అందులో ఉంటాయి. ఆ స‌మాచారాన్ని బ‌ట్టి న‌టులు అవ‌కాశాల ప‌రంగా ప్ర‌య‌త్నాలు చేసుకోవ‌చ్చు.

ఇండియాలో ఇంత వ‌రకూ ఇలాంటి ఆర్టిస్ట్ అసోసియేష‌నే లేదు. 'మా' శాశ్వ‌త స‌భ్య‌త్వం ఉన్న‌వారికే ఆరోగ్య‌భీమా... స‌భ్యులు కానీ ఆరుగురికి ఫించ‌న్ ర‌ద్దు చేసాం. వారిలో చనిపోయిన ఓ న‌టుడు కూతురు ఉంది. ఆ పాప‌కి నేను వ్య‌క్తిగ‌తంగా నేను చెల్లిస్తున్నా' అని అన్నారు. మొత్తానికి విష్ణు గ‌ద్దె ఎక్కి న నాటి నుంచి 'మా'లో భారీగానే ప్ర‌క్షాళ‌న జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.